అదంతా కేసీఆర్‌ డ్రామా.. నడ్డాకు చెప్పిన రాష్ట్ర బీజేపీ నేతలు..

26 Nov, 2022 08:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. శుక్రవారం పారీ్టలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేరిక అనంతరం ఆయనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌  నడ్డాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ఎర అంశం చర్చకు వచ్చింది. దీనిపై వివరణ ఇచ్చిన రాష్ట్ర నేతలు, ఇదంతా సీఎం కేసీఆర్‌ డ్రామా అని స్పష్టం చేశారు. ప్రజాబలంలేని పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి, వారితో డ్రామా ఆడించారని, నాటకం బయట పడకుండా ఎమ్మెల్యేలని ప్రగతిభవన్‌ బయటకు కూడా రానివ్వడం లేదని విశదీకరించారు. సీఎం ఫాంహౌస్‌లో ఉంటే ఎమ్మెల్యేలను అక్కడే ఉంచుతున్నారని, వారిని మీడియా ముందు మాట్లాడనివ్వడంలేదని చెప్పుకొచ్చారు.

సరిగ్గా ఇదే సందర్భంలో నడ్డా ‘ఫాంహౌస్‌ ముఖ్యమంత్రిని ఇకపై అక్కడే కూర్చోనిద్దాం’అని అన్నట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయమై కేంద్రాన్ని నిలదీసే అవకాశముందని కొందరు నేతలు నడ్డా దృష్టికి తెచ్చారు. అసెంబ్లీలో బీజేపీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, మాట్లాడితే సస్పెండ్‌ చేస్తున్నారని వివరించారు. ఇందుకు నడ్డా స్పందిస్తూ అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేస్తే అసెంబ్లీ బయట సీఎం తీరును ఎండగట్టాలని, ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు గట్టిగా జవాబివ్వాలని నేతలను ఆదేశించారు.
చదవండి: ‘ముందస్తు’ ప్రచారం.. కమలం అప్రమత్తం

మరిన్ని వార్తలు