Huzurabad Bypoll: హుజూరాబాద్‌లో విజయం మనదే

15 Jul, 2021 01:10 IST|Sakshi
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసిన వివేక్, ఈటల, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ తదితరులు

టీఆర్‌ఎస్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధైర్యంగా పోరాడండి 

తెలంగాణలో ఎన్నిసార్లైనా పర్యటించడానికి సిద్ధంగా ఉన్నా 

రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్‌ షా భరోసా 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈటల రాజేందర్‌ను గెలిపించుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై మరింత దృష్టి సారించాలని కమలదళం యోచిస్తోంది. అందులోభాగంగా వరుస భేటీలు, వ్యూహరచనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో తెలంగాణ బీజేపీ కీలక నేతలు భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలు జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ ఛుగ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు వివేక్‌ వెంకట స్వామి, జితేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఈటల గెలుపుపై సర్వే నివేదికలు: బండి సంజయ్‌ 
హుజూరాబాద్‌ ఉపఎన్నికతో పాటు, ఆగస్టు 9న ప్రారంభమయ్యే బండి సంజయ్‌ పాదయాత్ర, ఈ నెల 16 నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ చేపట్టనున్న పాదయాత్రలతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన ప్రణాళికలు, వ్యూహాలపై అమిత్‌ షాతో రాష్ట్ర నాయకులు చర్చించారు. హుజూరాబాద్‌లో ఈటల తప్పకుండా గెలుస్తారని సర్వే రిపోర్టులు సైతం వచ్చాయని అమిత్‌ షా వ్యాఖ్యానించారని బండి సంజయ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధైర్యంగా పోరాడాలని అమిత్‌ షా చెప్పారన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచార సమయంలో కానీ, ముందుకానీ ఎప్పుడు బహిరంగ సభ ఏర్పాటుచేసినా రావడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారని సంజయ్‌ తెలిపారు. అవినీతి, అరాచక పాలనను అంతం చేయడం కోసం క్విట్‌ ఇండియా ఉద్యమానికి నాంది పలికిన ఆగస్టు 9వ తేదీన భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. గ్రామాలవారీగా పాదయాత్ర కొనసాగుతుందని, గ్రామాల్లోని సమస్యలను తెలుసుకొనేందుకు వెళ్తున్నామన్నారు.  

16 నుంచి ఈటల పాదయాత్ర 
హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించారు. ఈ నెల 16న కమలాపూర్‌ మండలం బత్తురోనిపల్లి నుంచి ఈటల పాదయాత్రను ప్రారంభించనున్నారు. 22 రోజులపాటు నిర్వహించే పాదయాత్ర నియోజవర్గంలోని అన్ని గ్రామాల మీదుగా సాగి జమ్మికుంటలోని సైదాబాద్‌లో ముగియనుంది. 

మరిన్ని వార్తలు