కవితకు కౌంటర్‌గా బీజేపీ దీక్ష.. బండి సంజయ్‌ సంచలన కామెంట్స్‌!

10 Mar, 2023 13:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళా బిల్లు ఆమోదం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత.. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, కవిత ధర్నాకు కౌంటర్‌గా తెలంగాణలో బీజేపీ నేతలు మహిళా గోస-బీజేపీ భరోసా దీక్షకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలు దీక్ష చేస్తున్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. దీక్షలు చేసే అర్హత కవితకు లేదు. మహిళలపై జరుగుతున్న దాడులపై సీఎం కేసీఆర్‌ కనీసం స్పందించడం లేదు. మహిళలపై వేధింపుల కేసుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మహిళా సర్పంచ్‌లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీజేపీ. విదేశీ, ఆర్థిక మంత్రుల బాధ్యతలను మహిళలకు ఇచ్చిన ఘనత బీజేపీది. 

కేసీఆర్‌ ప్రభుత్వంలో మహిళలకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు. గురువారం జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో మహిళలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మాట్లాడలేదు. వచ్చే ఎన్నికల్లో 33 శాతం టికెట్లు మహిళలకే ఇస్తామని కేసీఆర్‌ ఎందుకు చెప్పలేదు. ఎమ్మెల్సీ కవిత కారణంగా తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. కవిత పాపులారిటీ తగ్గిపోతుందని బీఆర్‌ఎస్‌ పార్టీలో మహిళలను మాట్లానివ్వరు. లిక్కర్‌ దందాలో వచ్చిన డబ్బులతో రుణాలు ఇస్తారా? అని ప్రశ్నించారు.  

ఈడీ వస్తుందనే భయంతో దీక్షకు దిగారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలపై ఈడీ దాడులు జరుగుతుంటే సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే. మహిళలపై దాడులు చేసే వారిని బీఆర్‌ఎస్‌, ఎంఐఎం జెండాలు కాపాడుతున్నాయా?. లిక్కర్‌ స్కాంలో రేవంత్‌ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా?. లిక్కర్‌ స్కాంపై రేవంత్‌ ఎందుకు స్పందించడం లేదు అంటూ ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు