ఓట్లేయండి.. పేర్లు మారుస్తాం.. తెలంగాణలో కమలం పార్టీ  కొత్త వ్యూహం!

16 Dec, 2022 13:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా పట్టణాల పేర్ల మార్పుపై కమలం పార్టీ దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ ప్రచార వ్యూహంలో ఇది కూడా ఓ భాగమని విశ్లేషకులు ‍అభిప్రాయపడుతున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే టీఎర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది. తాజాగా తెలంగాణలో మరికొన్ని పట్టణాల పేర్లు మారుస్తామని బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది.

తెలంగాణలో తమను అధికారంలోకి తీసుకొస్తే నిజామాబాద్ పేరును ఇందూరుగా, మహబూబ్‌నగర్‌ పేరును పాలమూరుగా, వికారాబాద్‌ను గంగవరంగా, భైంసాను మైసాగా, కరీంనగర్‌ పేరును కరినగర్‌గా మారుస్తామని బీజేపీ చెబుతోంది. ఇప్పటికే సంఘ్ పరివార్ క్షేత్రాలు ఈ పట్టణాలను ఇదే పేర్లతో ప్రస్తావిస్తున్నాయి. మరి ఊరి పేర్ల నినాదంతో ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్న కమలం పార్టీ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వచ్చే ఏడాది తేలిపోనుంది.
చదవండి: ‘కాంగ్రెస్‌ సీనియర్లకు ఏమైంది?.. నేనింకా జూనియర్‌నే’

మరిన్ని వార్తలు