తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌లోపే ముగ్గురు మూడేసి..

23 Sep, 2023 16:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు యధాతథంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ  నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ఫోకస్‌ సారించింది. జాతీయ కీలక నేతలతో బహిరంగ సభలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. సెప్టెంబర్‌ 30వ తేదీన ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌కు రానున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోపే.. బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలంగాణలో బహిరంగ సభల్లో పాల్గొనేలా కార్యచరణ రూపొందించింది బీజేపీ. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముగ్గురు అగ్రనేతలు పర్యటించాలని గతంలోనే బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. షెడ్యూల్‌ వచ్చేలోపే  ఒక్కొక్కరు మూడేసి బహిరంగ సభల్లో పాల్గొనేలా షెడ్యూల్‌ రూపొందించింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నాగర్ కర్నూల్ జిల్లాలో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. త్వరలో ఈ ఇద్దరూ మళ్లీ తెలంగాణలో పర్యటిస్తారని సమాచారం.

ఇక 30న మహబూబ్‌నగర్‌ టూర్‌తో పాటు.. ఆ తర్వాతి రెండు బహిరంగ సభలు నిజామాబాద్‌, నల్లగొండలో ఉండొచ్చని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రస్థాయి నేతలతో కొత్త జిల్లా కేంద్రాల్లోనూ సభలు నిర్వహించే యోచనలో ఉంది బీజేపీ.  ఇవాళ ఢిల్లీ టూర్‌లో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి.. కేం‍ద్ర హోం మంత్రి  అమిత్ షాతో భేటీ అయ్యారు.  తెలంగాణలో ముఖ్యనేతల పర్యటనలు ఖరారు చేసుకొని ఈ రాత్రికి ఆయన తిరుగు పయనం కావొచ్చని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు