ప్రై‘వేటు’ కుట్రలో భాగమే ఆర్టీసీ చార్జీల పెంపు

11 Jun, 2022 01:55 IST|Sakshi
ప్రయాణికులతో మాట్లాడుతున్న  బండి సంజయ్‌ 

జేబీఎస్‌ వద్ద నిరసనలో బండి సంజయ్‌ ఆరోపణలు

మూడేళ్లలో ఐదుసార్లు పెంచినట్లు వెల్లడి

రాష్ట్రంలో వెలుగులోకి రోజుకో అత్యాచారం 

బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు

ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?

కంటోన్మెంట్‌/కూకట్‌పల్లి (హైదరాబాద్‌): టీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలపై చార్జీల భారం వేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఆర్జీసీ చార్జీల పెంపునకు నిరసనగా ఆయన శుక్రవారం జూబ్లీ బస్‌స్టేషన్‌ ఆవరణలో బీజేపీ నేతలతో కలసి నిరసనలో పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో గత మూడేళ్లలో ఐదుసార్లు ఆర్టీసీ చార్జీలు పెరిగాయని, చార్జీల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం పేదలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కార్లు, ప్రైవేటు వాహనాల్లో వెళ్లలేని ప్రయాణికులకు ఆర్టీసీ మాత్రమే దిక్కుగా ఉందని, చార్జీలు పెంచడం ద్వారా ఆర్టీసీని ప్రయాణికులకు దూరం చేసి, సంస్థను ప్రైవేటు పరం చేసే కుట్ర సాగుతోందని ఆరోపించారు. 

కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌
దేశంలో బీజేపీ నీతివంతమైన పాలన సాగిస్తుండగా రాష్ట్రంలో మాత్రం అవినీతి శక్తులతో కలిసి ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని బండి ఆరోపించారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనపై, 8 ఏళ్ల కేసీఆర్‌ మూర్ఖపు పాలనపై చర్చకు వచ్చేందుకు సిద్ధమేనా అని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ పాలనలో రోజుకో అత్యాచారం వెలుగుచూస్తోందని, ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర పథకాలు రాష్ట్రానికి అందాలంటే, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం రావాలని కాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌ సుందర్‌ గౌడ్, కంటోన్మెంట్‌ బోర్డు సభ్యుడు రామకృష్ణ, మేకల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు