కేంద్రాన్ని బద్నామ్‌ చేసేందుకు కేసీఆర్‌ కుట్రలు

31 May, 2022 01:27 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న బండి సంజయ్‌ 

టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే ఇదంతా: బండి సంజయ్‌ 

బడాబాబుల కరెంటు దోపిడీని అరికట్టేందుకే మీటర్లు  

సాక్షి, హైదరాబాద్‌: ‘టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. వారి దృష్టి మళ్లించి కేంద్రాన్ని బద్నామ్‌ చేసే కుట్రలకు సీఎం కేసీఆర్‌ పాల్పడుతున్నారు’అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్రం లో మంత్రులను ప్రజలు వెంటపడి కొట్టే పరిస్థితులు వచ్చాయన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కాలు ష్యం పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం మూసేయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఎరువులకు ఇబ్బంది లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంటే బీజేపీకి పేరొస్తుందనే ఫ్యాక్టరీని మూసేయించారని ఆరోపించారు. ఫ్యాక్టరీలో ఉద్యోగాలిప్పిస్తానని టీఆర్‌ఎస్‌ నేతలు ఎంతోమంది యువకుల నుంచి రూ. కోట్లు దండుకున్నారని, వాళ్లంతా తిరగబడుతున్నారని ఫ్యాక్టరీనే మూసేయించడం సిగ్గుచేటన్నారు. ‘హైదరాబాద్‌ చుట్టూ చాలా ఫార్మా కంపెనీలున్నయ్‌.  వాటిని మూసేస్తరా?’అని నిలదీశారు. 

40 గ్రామాలకు సరిపడా కరెంటును కేసీఆర్‌ వాడుతున్నారు 
24 గంటల ఉచిత విద్యుత్‌ పేరుతో కేసీఆర్‌ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఫాంహౌజ్‌లోనే సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసుకుని 40 గ్రామాలకు సరిపడా కరెంట్‌ను ఫ్రీగా వాడుకుంటున్నారని ఆరోపించారు. 

కేసీఆర్‌ ఫాంహౌస్‌ కరెంటు దొంగతనం తెలుస్తుందని.. 
ఉచిత విద్యుత్‌ పేరుతో రైతులకు ఇవ్వాల్సిన కరెంట్‌ను సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు, బడాబాబులు తమ ఫాంహౌస్‌లు, బిల్డింగుల పేరు మీద ఇష్టానుసారం వాడుకుంటున్నారని..దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకే సబ్‌ స్టేషన్ల వద్దనున్న ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పిందని సంజయ్‌ వివరించారు. మీటర్లు పెడితే సీఎం ఫాంహౌస్‌ కరెంట్‌ దొంగతనం బయటపడుతుందని, బడాబాబుల దొంగతనం తెలుస్తుందని రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమంటున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 

ఆధారాలుంటే బయటపెట్టండి 
ఆదానీ కోల్‌ మైన్‌ నుంచి బొగ్గు కొనాలని కేంద్రం చెప్పిందం టూ ట్రాన్స్‌కో సీఎండీ చెప్పడం పచ్చి అబద్దమని, అందుకు ఆధారాలుంటే బయటపెట్టాలని సంజయ్‌ అన్నారు. సింగరేణి కార్మికులు దాచుకున్న రూ.17 వేల కోట్ల విలువైన డిపాజిట్లను కాజేసి వాళ్లకే జీతాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని ధ్వజమెత్తారు. భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ పెద్ద కుంభకోణమని, నష్టం వస్తుందని ఇండియా బుల్స్‌ వదిలేస్తే బినామీలతో పెట్టుబడులు పెట్టించారని ఆరోపించారు.

కేంద్రాన్ని బూచిగా చూపి రాష్ట్రంలో మళ్లీ విద్యుత్‌ చార్జీలు పెంచే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇటీవల సంజయ్‌ కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘హిందువులపై, హిందూ ధర్మంపై దాడి చేస్తుంటే కుహనా లౌకిక శక్తులు ఎందుకు స్పందించవు? మతాల గురించి మాట్లాడే వాళ్లు బైంసా ఘటన, నిర్మల్, కామారెడ్డి హత్యలపై ఎందుకు స్పందించట్లేదు’అని నిలదీశారు.   

మరిన్ని వార్తలు