ఆత్మహత్యలు చూపిస్తా.. పాలమూరుకు రా.. 

3 May, 2022 03:33 IST|Sakshi
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్‌లో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌   

సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ సవాల్‌ 

పేదలకు కేంద్రమిస్తున్న ఉచిత బియ్యం అందకుండా చేశారని ఆరోపణ 

నారాయణపేట జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర 

నారాయణపేట: ‘‘చేనేత కార్మికుల ఆత్మహత్యలు, వలసలు ఆగిపోయాయని అంటున్నారు. సీఎం కేసీఆర్‌ దమ్ముంటే పాలమూరుకు రావాలి. ఇక్కడి ఆత్మహత్యలు, వలసలు, జనం గోస చూపిస్తా..’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ చేశారు. సోమవారం రాత్రి ఆయన నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్‌లో 19వ రోజు ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగించారు. చేనేత రంగానికి కేంద్రం చేసిందేమీ లేదంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఈ సందర్భంగా బండి సంజయ్‌ మండిపడ్డారు.

‘‘కేంద్రం దేశవ్యాప్తంగా ఏడు మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్స్‌ పార్కులకు రూ.4,445 కోట్లు మంజూరు చేసింది. అందులో ఒకటి తెలంగాణకు ఇచ్చి మార్చి 15లోగా స్థలం కేటాయించాలని జనవరి 15నే లేఖ రాసింది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపలేదు’’అని విమర్శించారు. పాదయాత్రలో తాను ఎక్కడికి వెళ్లినా చేనేత కార్మికుల ఆర్తనాదాలు, వలస గోసలే కనిపిస్తున్నాయని చెప్పారు. కేంద్రం పేదలకు ఉచిత బియ్యం ఇస్తుంటే.. అది అందకుండా కేసీఆర్‌ నిలిపేశారని ఆరోపించారు.

చేనేత రంగానికి, గొర్రెల పంపిణీ కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్ల సబ్సిడీని అందజేసిందన్నారు. కాగా.. ప్రజల కష్టాలు, సమస్యలను ప్రపంచానికి చూపడానికే బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు