కబంధహస్తాల నుంచి విముక్తి కల్పిస్తాం

28 Jun, 2022 03:23 IST|Sakshi

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి.. సుపరిపాలన నెలకొల్పడమే బీజేపీ లక్ష్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే పుంజుకుందని.. మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేసే దిశగా హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చేనెల 1 నుంచి 3వ తేదీ వరకు కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తరుణ్‌ చుగ్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ ్య ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు తరుణ్‌ చుగ్‌ మాటల్లోనే.. 

కేసీఆర్‌ కుటుంబ పాలనపై వ్యతిరేకత 
చిన్నరాష్ట్రాల ఏర్పాటు ద్వారా వేగంగా అభివృద్ధి, సంక్షేమం, మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది బీజేపీ నమ్మకం. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించింది. కానీ సీఎం కేసీఆర్‌ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా.. తన కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చుకున్నారు.

ఈ కుటుంబ, అవినీతి పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్‌ కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించి.. సుపరిపాలన నెలకొల్పాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు ముందుకొచ్చినా తెలంగాణలోనే జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది. 

మరింత ఊతమిచ్చేందుకు.. 
నిజానికి కేవలం కార్యవర్గ భేటీ నిర్వహణతోనే ఇక్కడ సాధించేదేమీ లేదు. అయితే రాష్ట్రంలో దుష్టపాలన, మహిళలు, బలహీనవర్గాలపై దాడులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు వంటి అంశాల్లో బండి సం జయ్‌ నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతోంది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్‌ఎంసీలో గణనీయ స్థానాలు సాధించడం ద్వారా పార్టీ బాగా పుంజుకుంది.

దీన్ని మరింత విస్తృతపర్చుకుని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేలా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తాం. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన అంశాలపై పార్టీ అత్యున్నత కార్యవర్గం చర్చించి.. ప్రాధాన్యతల పరంగా నిర్ణయాలు తీసుకుంటుంది. 

మోదీ నామస్మరణ ఒక్కటి చాలు 
ప్రధాని మోదీ బహిరంగ సభ కోసం రాష్ట్ర పార్టీ తన వంతు కృషి చేస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రధాని మోదీ పేరొక్కటి చాలు. దేశ ప్రజలకు ఆయన పేరే ఒక ప్రత్యేక ఆకర్షణగా, ఒక మంత్రంగా మారింది. అదే బీజేపీకి శ్రీరామరక్ష. మోదీ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు వస్తారని అంచనా వేస్తున్నాం. సభ దిగ్విజయం అవుతుంది. కేసీఆర్, టీఆర్‌ఎస్‌ల చెవులు చిల్లులు పడేలా స్పష్టమైన సందేశాన్ని వినిపిస్తుంది. 

మా అంచనాలు మాకున్నాయి 
తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామనడానికి మా అంచనాలు మాకున్నాయి. పార్టీపరంగా ఉన్న వ్యవస్థతో ప్రజల మూడ్‌ను గమనించగలుగుతున్నాం. క్షేత్రస్థాయి పరిస్థితులు, వివిధ వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆవేదన, టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను చూస్తే.. ‘గోడ మీద రాత’ మాదిరిగా టీఆర్‌ఎస్‌ ఓటమి నిర్ణయమై పోయింది. బీజేపీయే నిజమైన ప్రత్యామ్నాయమని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. 

గేట్లు తెరిచామంటే వరదలా వచ్చేస్తారు 
క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా లేదనేది ఒక అపోహ మాత్రమే. బూత్‌ స్థాయి నుంచీ మాకు పార్టీ యంత్రాంగం ఉంది. సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నాం. ప్రజాకర్షక నాయకులు లేకున్నా మోదీ పేరు ప్రతిష్టలు, దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన ప్రగతే ఓట్లు తెచ్చి పెడుతుంది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మేం ఒకసారి గేట్లు తెరిచామంటే వరదలా వచ్చేస్తారు. అయినా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చెందిన పెద్దనేతలెవరూ మాకు అవసరం లేదు. వారిలో అధికశాతం అవినీతిపరులు, మరకలున్నవారే. కొందరు మంచి నేతలు కాలక్రమంలో బీజేపీలో చేరుతారు. 

పార్టీలో కుమ్ములాటలేవీ లేవు 
మాది క్రమశిక్షణ గల పార్టీ. నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలేవీ లేవు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకున్నాక ఆయా విషయాలపై అందరూ సర్దుకుంటారు. 

కాంగ్రెస్‌ అంతర్ధానమై పోయినట్టే.. 
తెలంగాణలో కాంగ్రెస్‌ బలంగా ఉందని మేం అనుకోవడం లేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కాంగ్రెస్‌ కుచించుకుపోయి అంతర్ధానమయ్యే స్థితికి చేరింది. 

అది టీఆర్‌ఎస్‌ వర్గాల ప్రచారమే.. 
బీజేపీ–టీఆర్‌ఎస్‌ మధ్య ఎలాంటి దోస్తీ లేదు. టీఆర్‌ఎస్‌ వర్గాలే ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారానికి దిగుతున్నాయి. బీజేపీ సొంతంగానే తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటోంది.   

మరిన్ని వార్తలు