ముందస్తు ఎన్నికలు ఖాయం: ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ 

30 Nov, 2022 01:36 IST|Sakshi

కామారెడ్డి టౌన్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ అకస్మాత్తుగా ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చి జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వెనక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉండి ఉండవచ్చన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సిద్ధాంతం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఎజెండాతో ఏర్పాటైన పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. బిహార్, పంజాబ్‌ రాష్ట్రాల్లో పలువురు రైతులు, సైనికులకు ఆర్థిక సాయం చేసినంత మాత్రాన ప్రజలు ఆదరించరని తెలిపారు. కమ్యూనిస్టుల మద్దతు తీసుకుని, వందలమంది నాయకులను మోహరించి, రూ.500 కోట్లు ఖర్చు చేస్తేగానీ మునుగోడు ఉపఎన్నికలో గెలవలేదని ప్రవీణ్‌ ఎద్దేవాచేశారు.

బీఎస్పీ కార్యకర్తలు గ్రామగ్రామాన నూతన కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. త్వరలో బహుజన రాజ్యాధికార యాత్ర కామారెడ్డి జిల్లాలో చేపడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజు, జిల్లా ఇన్‌చార్జులు సురేశ్‌గౌడ్, సాయిలు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, మహిళా కన్వీనర్‌ వసంత తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు