ఆత్మగౌరవంతో ముందుకు వెళదాం

31 Jul, 2022 03:00 IST|Sakshi

సిరిసిల్ల సభలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌

సిరిసిల్ల: ఆకలితోనైనా చస్తాం.. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టు కోమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పేర్కొ న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీలంతా కలసి ఆత్మగౌరవంతో ముందుకు వెళదామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం విశ్వకర్మీయుల ఆత్మగౌరవసభలో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడారు. తెలంగాణలో అగ్రకులాలు పేదలను విభజించి పాలిస్తున్నాయని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ అహంకారంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏకంగా బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్నే మార్చాలంటున్నారని విమర్శించారు. ‘నేను సిరిసిల్లకు వస్తుంటే అనేక అడ్డంకులు సృష్టించారు, మీ నాయన కుట్రలను భరించలేకనే 26 ఏళ్లు చేసిన ఉద్యోగాన్ని వదిలేసి ప్రజల కోసం బయటకు వచ్చా’అని ప్రవీణ్‌కుమార్‌.. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

ప్రగతిభవన్‌ వేదికగా అనేక కుట్రలు జరుగుతున్నాయన్నారు. ‘బహుజనులంతా ఒకరితో ఒకరు కలుద్దాం.. నిలుద్దాం.. గెలుద్దాం’అని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆయన గంభీరావుపేట మండలం నర్మాలలో కూడా మాట్లాడారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పేరిట 200 మంది పేదల వద్ద బలవంతంగా 370 ఎకరాల భూములు లాక్కున్నారని ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

వారికి ఎకరానికి రూ.5 లక్షలు మాత్రమే చెల్లించారని, ఈ భూముల్లో అధికార పార్టీ నేతలు విల్లాలు కడుతున్నారని మండిపడ్డారు. బాధితులకు అండగా ఉంటానని ప్రవీణ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. సిరిసిల్లలో దీక్షలు చేస్తున్న వీఆర్‌ఏల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల సభలో విశ్వకర్మ నాయకులు దాసోజు శ్రవణ్, ఆచారి, మురళి, మధుచారి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు