కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యం 

1 Jun, 2022 00:51 IST|Sakshi
గిరిజన మహిళలతో కలిసి భోజనం చేస్తున్న ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌   

బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌కుమార్‌  

కామేపల్లి: అవినీతిమయంగా మారిన సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా బీఎస్పీ పని చేస్తోందని, ఇందులో భాగంగానే బహుజన రాజ్యధికార యాత్ర చేపట్టామని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర మహబూబాబాద్‌ నుంచి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి చేరుకుంది.

ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరితహారం పేరుతో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటూ అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. అకాల వర్షం, తెగుళ్లతో పంటలు నష్టపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకోని సీఎం కేసీఆర్‌.. పంజాబ్‌ రైతులకు రూ.18 కోట్లకు పరిహారం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

సర్పంచ్‌లు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేస్తే బిల్లులు చెల్లించకపోవడంతో వారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిన నేపథ్యంలో జూన్‌లో రైతుబంధు, ఉద్యోగుల వేతనాలకు నిధులు ఎలా సమకూరుస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రవీణ్‌ డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలివ్వడంతో పాటు ఎస్సీ, బీసీ కులాలకు ప్రత్యేక ప్యాకేజీ, గిరిజనులకు 10% రిజర్వేషన్‌ కల్పిస్తామన్నారు.   

మరిన్ని వార్తలు