రాజ్యాధికారం దక్కే వరకు పోరాటం 

19 Apr, 2022 03:20 IST|Sakshi
గురుకులం విద్యార్థినులతో ప్రవీణ్‌కుమార్‌ 

కూసుమంచి: బహుజనులకు రాజ్యాధికారం దక్కేదాకా పోరాటం ఆగదని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. ఆయన చేపట్టిన బహుజనుల రాజ్యాధికార యాత్ర సోమవారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద ప్రవేశించిన యాత్ర పాలేరు, కూసుమంచి, గట్టుసింగారం, మల్లేపల్లి, జుజుల్‌రావుపేట, లోక్యాతండా, కోక్కాతండా, నేలపట్ల, అగ్రహారం గ్రామాల్లో కొనసాగింది. ఆయన పలు కాలనీలు, వసతిగృహాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్‌ కుటుంబం పాలనలో ఘోరంగా విఫలమైన విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లుగా దళితుడు సీఎం కాలేదని, దళితులకు మూడెకరాల భూమిదక్కలేదని, తాజాగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కూడా అదే కోవలోకి వెళ్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అరాచక పాలనను ప్రజల్లో ఎండగట్టి బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం సాధించేదిశగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సీఎం కేసీఆర్‌కు పరాజయం తప్పదని, వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధించి రాష్ట్రంలో పాగా వేయటం ఖాయమన్నారు. యాత్రలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర సాహూ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు