మోదీ ‘రద్దు’ ప్రకటన నాటకమే 

22 Nov, 2021 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ ఏ విషయంలో ఎవరికి ఎందుకు క్షమాపణ చెప్పారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. రైౖతులకు నష్టం కలిగించే నల్ల చట్టాలను రద్దు చేస్తామన్న మోదీ ప్రకటనను రైతులు నాటకంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డిలతో కలసి ఎంబీ భవన్‌లో బీవీ రాఘవులు విలేకరులతో మాట్లాడారు.

మోదీ ప్రకటనలో స్పష్టత లేదనీ, ప్రజల సానుభూతి పొందేందుకు ఒక నాటకంలా ఉందని ఆయన విమర్శించారు. కేంద్రం నిర్ణయం వల్ల 750 మంది రైతన్నలు బలైనందుకు మోదీ క్షమాపణ చెప్పారా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కాన్వాయ్‌తో రైతులను తొక్కించి చంపినందుకు ఆయన క్షమాపణ చెప్పారా అని నిలదీశారు. కిసాన్‌ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 26న నిరసన కార్యక్రమాలతోపాటు విజయోత్సవాలు నిర్వహించాలని రైతాంగాన్ని కోరారు. 

కేసీఆర్‌పై అపవాదు 
రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ విద్యుత్‌ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న సీఎం కేసీఆర్‌ ప్రకటన హర్షణీయమని బీవీ రాఘవులు చెప్పారు. అప్పుడప్పుడూ ప్రజాఉద్యమాలకు మద్దతు ప్రకటించి ఆ తర్వాత నిశ్శబ్దం వహిస్తారన్న అపవాదు కేసీఆర్‌పై ఉందని, ఇప్పుడు కేంద్రంపై నికరంగా మాట్లాడి ఆ మచ్చను తొలగించుకోవాలని సూచించారు. హుజూరాబాద్‌ ఫలితం కారణంగానే కేసీఆర్‌ ఆ విధంగా స్పందించారని ప్రజలు భావిస్తున్నారన్నారు.

తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ యాసంగి ధాన్యాన్ని కూడా కేంద్రం కొనుగోలు చేయాలని, ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేలా అఖిలపక్షంతో కలిసి సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో తెరవాలని డిమాండ్‌ చేశారు. మైనారిటీలపై దాడులకు నిరసనగా డిసెంబర్‌ 1న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు