తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

9 Mar, 2023 19:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సుమారు ఐదు గంటల పాటు భేటీ సాగింది. సమావేశం అనంతరం కేబినెట్‌ కీలక నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు మీడియాకు వెల్లడించారు. దళిత బంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

గృహలక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇస్తాం.. నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇళ్లు కేటాయిస్తామన్నారు. లబ్ధిదారుడికి రూ.3లక్షల గ్రాంట్‌ ఇస్తామని హరీష్‌రావు పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక వెంటనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించిందని హరీష్‌రావు పేర్కొన్నారు.

కాగా, సమావేశంలో గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన ఇద్దరిని ఖరారు చేయడంతో పాటు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపైనా చర్చించినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు నోటీసులు జారీచేసిన అంశంపైనా భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈడీ విచారణ సందర్భంగా ఒకవేళ కవితను అరెస్టుచేస్తే ఎలా స్పందించాలి, కేంద్రం రాష్ట్రంపై వ్యవహరిస్తున్న కక్షసాధింపు చర్యలపై మున్ముందు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం.
చదవండి: ఇది నా ఒక్కరి సమస్య కాదు.. ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటా: ఎమ్మెల్సీ కవిత

మరిన్ని వార్తలు