రాష్ట్రంలో అంగన్‌వాడీలకు పెద్దపీట 

30 Aug, 2021 00:58 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న హరీశ్‌. చిత్రంలో గంగుల 

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు  

దేశంలోనే అత్యధిక జీతాలు ఇస్తున్నది టీఆర్‌ఎస్‌ సర్కారే.. 

సూపర్‌వైజర్లుగా పదోన్నతి కల్పించేందుకు హామీ 

బీజేపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని మండిపాటు 

హుజూరాబాద్‌: రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవేతనం రూ.2,700 అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వేతనం రూ.10,950 అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చినా.. కేంద్రమే ఇస్తోందంటూ బీజేపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో టీఎన్‌జీవోఎస్‌ ఆధ్వర్యంలో పీఆర్సీ పెంపుపై కృతజ్ఞతసభ నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇచ్చేది టీఆర్‌ఎస్‌ సర్కారు అయితే.. చెప్పుకునేది బీజేపీ అని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో అంగన్‌వాడీ టీచర్‌ జీతం, మన రాష్ట్రంలో ఆయాలకు ఇచ్చే మొత్తంతో సమానమని తెలిపారు. వారికి దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఒకప్పుడు జీతాలు పెంచాలని అంగన్‌వాడీ టీచర్లు రోడ్డెక్కారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారిని ప్రగతిభవన్‌కు పిలిచి మరీ జీతాలు పెంచారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వారికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని, అంగన్‌వాడీలకు ఏడేళ్లలో మూడుసార్లు వేతనం పెంచామని పేర్కొన్నారు.

త్వరలోనే అంగన్‌వాడీలకు సూపర్‌వైజర్లుగా పదోన్నతులు కల్పించేలా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే అంగన్‌వాడీల జీతాలు కూడా ప్రతినెలా మొదటివారంలో వచ్చేలా కృషి చేస్తామన్నారు. అంగన్‌వాడీలలో అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామన్నారు. ప్రజలకోసం పనిచేసే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లు చేసేది ఉద్యోగం కాదని, సమాజ సేవ అని అన్నారు. వారికి ఎంత జీతం ఇచ్చినా తక్కువే అని గ్రహించిన సీఎం కేసీఆర్‌ తగిన వేతనాలు పెంచారని తెలిపారు. టీఎన్‌జీవో సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీఆర్‌ఎస్‌ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డి, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాళ్లు ఉషారాణి, జయ తదితరులు సభలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు