దేశంలో సెన్సేషన్‌ జరగాలి.. జరుగుతుంది: తెలంగాణ సీఎం కేసీఆర్‌

22 May, 2022 01:21 IST|Sakshi

సెన్సేషన్‌ జరిగి తీరుతుంది.. మున్ముందు మీరే చూస్తారు: ఢిల్లీలో కేసీఆర్‌ 

రాజకీయ నేతలతో రాజకీయాలే చర్చిస్తాం 

అఖిలేశ్, కేజ్రీవాల్‌లతో కేసీఆర్‌ భేటీ 

కేంద్రం, బీజేపీ విధానాలతో రాష్ట్రాల హక్కులకు ముప్పు 

విభజన రాజకీయాలతో దేశ సమగ్రతకు ప్రమాదం 

ఐక్యంగా కొట్లాడుదామని పిలుపు 

కేజ్రీవాల్‌తో కలిసి పలు పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌ల సందర్శన 

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో సంచలనం జరగబోతోందని, త్వరలోనే అంతా చూస్తారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ‘‘దేశంలో సెన్సేషన్‌ జరగాల్సి ఉంది. అది జరిగి తీరుతుంది. దీన్ని మున్ముందు మీరే చూస్తారు’’ అని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లతో భేటీని ప్రస్తావిస్తూ.. ‘బిజినెస్‌మన్‌తో బిజినెస్‌ అంశాలే చర్చించినట్టుగా.. రాజకీయ నేతలతో రాజకీయ అంశాలే చర్చించాం’’ అని తెలిపారు. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా రూపకల్పనలో భాగంగా ఢిల్లీ పర్యటన చేపట్టిన సీఎం కేసీఆర్‌.. శనివారం ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా, ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు కొనసాగిస్తున్న విధానాలపై సంఘటితంగా కొట్లాడాల్సిన తరుణం ఆసన్నమైందని ఈ సందర్భంగా కేజ్రీవాల్, అఖిలేశ్‌లతో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్టు సమాచారం. కేంద్రం అవలంబిస్తున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయి పోరాటం  అవసరమని.. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు కలిసి నడుద్దామని ప్రతిపాదించినట్టు తెలిసింది. 

కేసీఆర్‌ నివాసానికి అఖిలేష్‌ 
ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్‌ నివాసానికి వచ్చారు. కేసీఆర్‌ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లతో కలిసి అఖిలేష్‌ భోజనం చేశారు. తర్వాత కేసీఆర్, అఖిలేష్‌ సుమారు రెండున్నర గంటల పాటు భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. 

ఉమ్మడిగా ఎదుర్కొందాం! 
ఇటీవలి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎస్పీ ఎదుర్కొన్న తీరు, రైతు సమస్యలపై ఆ పార్టీ చేసిన పోరు, దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్డీయే సర్కారును ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్, అఖిలేష్‌ చర్చించుకున్నట్టు సమాచారం. బీజేపీ మతపరమైన అంశాలను ముందుపెట్టి రాజకీయ లబ్ధి పొందుతోందని, ఈ విభజన రాజకీయాలను ఎదురించకుంటే దేశ సమగ్రత దెబ్బతింటుందని కేసీఆర్‌ అభిప్రాయపడినట్టు తెలిసింది. మతపరమైన అంశాలను వివాదాస్పదం చేయడం, తద్వారా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాజకీయ లబ్ధి పొందడం బీజేపీకి పరిపాటిగా మారిందని పేర్కొన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రైతు అంశాలపైనా ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. తెలంగాణలో రైతులను ఆదుకునేలా, వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని.. కానీ ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రం సహకరించకుండా ఇబ్బందిపెట్టిందని కేసీఆర్‌ పేర్కొన్నట్టు తెలిసింది.

మద్దతు ధర, వ్యవసాయోత్పత్తుల సేకరణ విషయంలో జాతీయ విధానాన్ని తేవాల్సి ఉన్నా.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడినట్టు సమాచారం. రాష్ట్రాల అభిప్రాయాలకు విరుద్ధంగా విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు, కార్పొరేషన్‌ రుణాలు దక్కకుండా షరతులు, గ్రామ పంచాయతీ నిధుల్లో జోక్యం వంటివాటితో కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ అంశాలన్నింటిపై భావ సారూప్య పార్టీలన్నీ ఉమ్మడిగా కొట్లాడితేనే దేశంలో గుణాత్మక మార్పు వస్తుందని సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పినట్టు సమాచారం. వీటన్నింటిపైనా కేసీఆర్‌ వాదనతో అఖిలేష్‌ కూడా ఏకీభవించినట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. అఖిలేష్‌తో భేటీ అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌తో కేసీఆర్‌ సమావేశమై చర్చించారు. అయితే పాఠశాలలు, మొహల్లా క్లీనిక్‌ల సందర్శన కార్యక్రమాలు ఉండటంతో.. ఆదివారం చండీగఢ్‌ పర్యటనలో మరింత లోతుగా చర్చించాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించినట్టు సమాచారం. 

సెన్సేషన్‌ జరుగుతుంది: కేసీఆర్‌ 
కేజ్రీవాల్‌తో కలిసి పాఠశాలను సందర్శించిన సందర్భంగా కేసీఆర్‌ను మీడియా పలకరించింది. అఖిలేష్‌తో భేటీలో ఏమేం చర్చించారని ప్రశ్నించగా.. ‘‘బిజినెస్‌మన్‌తో బిజినెస్‌ అంశాలే చర్చించినట్టుగా రాజకీయ నేతతో అవే అంశాలు చర్చించాం. దేశంలో సెన్సేషన్‌ జరగాల్సి ఉంది. అది జరిగి తీరుతుంది. దీన్ని మున్ముందు మీరే చూస్తారు..’’ అని కేసీఆర్‌ బదులిచ్చారు. ఇంతకుమించి మాట్లాడేందుకు నిరాకరించారు. పాఠశాల ప్రాంగణంలో రాజకీయ అంశాలు మాట్లాడలేనని, వీటిపై మరోసారి మాట్లాడుతానని చెప్పారు.   

మరిన్ని వార్తలు