కేంద్రం నిర్ణయంపై కేసీఆర్ ‌అసంతృప్తి

1 Sep, 2020 15:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు లేఖ రాశారు. రాష్ట్రాల సమ్మతి లేకుండా జీఎస్టీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవే అని.. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రా ఖజానాకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయిందని, ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రతిపాదనలు ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. జీఎస్టీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే.. దేశం అభివృద్ధి చెందినట్లే అని పేర్కొన్నారు. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన దేశం అవుతుందన్నారు. కరోనా క్లిష్ట సమయంలోరుణాలపై ఆంక్షలు సహేతుకం కాదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు.. ‘జాతీయ ప్రయోజ‌నాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ బిల్లును స‌మ‌ర్థించింది. మొట్టమొద‌లు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది తెలంగాణ ప్రభుత్వమే. జీఎస్టీ ఫ‌లాలు దీర్ఘకాలికంగా ఉండి.. రాబోయే రోజుల్లో మ‌రిన్ని పెట్టుబ‌డులు రావ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని అనుకున్నాం. సీఎస్టీని ర‌ద్దు చేసే స‌మ‌యంలో పూర్తి ప‌రిహారాన్ని అంద‌జేస్తామ‌ని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్రాలు సీఎస్టీ ప‌రిహారాన్ని తిర‌స్కరించాయి. స‌రిగ్గా ఇదే కార‌ణంపై రాష్ర్టాల ఒత్తిడి మేర‌కు రెవెన్యూ న‌ష్టాన్ని పూడ్చడానికి ప్రతి రెండు నెల‌ల‌కోసారి పూర్తి జీఎస్టీ ప‌రిహారం చెల్లించే విధంగా చ‌ట్టంలో క‌చ్చితంగా నిబంధ‌న ఉన్నా.. జీఎస్టీ ప‌రిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోంది. (ఉప ఎన్నిక.. తనయులు రాజకీయ అరంగేట్రం!)

ఏప్రిల్ నుంచి రాష్ట్రాల‌కు జీఎస్టీ ప‌రిహారం అంద‌లేదు. కోవిడ్-19 కార‌ణంగా 2020, ఏప్రిల్లో నుంచి తెలంగాణ ప్రభుత్వం 83 శాతం రెవెన్యూను న‌ష్ట‌పోయింది. అదే స‌మ‌యంలో రాష్ట్రాల అవ‌స‌రాలు, పేమేంట్ల భారం పెరిగిపోయింది. మార్కెట్ బారోయింగ్స్ ద్వారా, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు, ఓవ‌ర్ డ్రాఫ్ట్ ల ద్వారా ఈ ప‌రిణామాల నుంచి గ‌ట్టెక్కాల్సి వ‌చ్చింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉన్న కార‌ణంగా రాష్ట్రాలు విధిగా కేంద్రంపై ఆధార‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్ బారోయింగ్‌ల‌కు కేంద్రంపై ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది. ఇది స‌మాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమ‌ని’ సీఎం లేఖ‌లో పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా