ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ..! మునుగోడులో పరిస్థితిపై కేసీఆర్‌ ఆరా

3 Nov, 2022 03:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డిన టీఆర్‌ఎస్‌ పెద్దలు పోలింగ్‌ ముందు మరింత అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుండటం, ఓటేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న స్థానికులు, పోలింగ్‌ సమయంలో ఓటర్లను తిప్పుకొనేందుకు జరిగే ప్రయత్నాలు.. వంటివాటి నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. నియోజవకర్గంలో పరిస్థితులు, పరిణామాలపై టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ బుధవారం ముఖ్య నేతలతో పలుమార్లు చర్చించారు.

వివిధ సంస్థలు, ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా సూచనలు చేశారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పార్టీ నల్లగొండ ఇన్‌చార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావుతోపాటు కొందరు ముఖ్య నేతలు కూడా ఈ టెలీ కాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. ఇక మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో యూనిట్‌ ఇన్‌చార్జులుగా వ్యవహరించిన నేతలను కేటీఆర్‌ హైదరాబాద్‌ నుంచి సమన్వయం చేస్తున్నారు.

యూనిట్‌ ఇన్‌చార్జులు పోలింగ్‌ బూత్‌ల వారీగా స్థానిక నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి కేటీఆర్‌కు నివేదిస్తున్నారు. నల్లగొండలో మకాం వేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి అక్కడి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు.

బయటి ఓటర్లపై ప్రత్యేక దృష్టి! 
మునుగోడు నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో సుమారు 40వేల మంది ఉపాధి, ఇతర అవసరాలపై హైదరాబాద్, నల్లగొండతోపాటు ముంబై వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లారు. ఇలాంటి వారందరి వివరాలను 20 రోజుల క్రితమే టీఆర్‌ఎస్‌ శ్రేణులు సేకరించాయి. హైదరాబాద్, నల్లగొండ తదితర చోట్ల నివాసం ఉంటున్న ‘మునుగోడు’ఓటర్లను టీఆర్‌ఎస్‌ ప్రత్యేక బృందాలు కలుసుకుని.. ఓటింగ్‌ రోజున సంబంధిత పోలింగ్‌ బూత్‌లకు చేరుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముంబై వంటి దూరప్రాంతాల నుంచీ ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నించాయి.

అప్రమత్తంగా ఉండాలి 
ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ పెద్దలు దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌ సందర్భంగా కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలకు దిగి, సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నాలు చేయవచ్చని.. ఉద్వేగాలకు లోనుకాకుండా అప్ర మత్తంగా ఉండాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటింగ్‌ సరళిని చూసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం.
చదవండి: ఓటమి భయంతోనే దాడులు.. ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ

మరిన్ని వార్తలు