23న వనపర్తికి సీఎం కేసీఆర్‌ 

18 Dec, 2021 04:07 IST|Sakshi

సీఎం జిల్లా పర్యటన షెడ్యూల్‌లో స్వల్పమార్పు

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపై ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలోసీఎం కేసీఆర్‌ ఈ నెల 20 నుంచి తలపెట్టిన జిల్లా పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈనెల 19 నుంచి ప్రారంభం కావాల్సిన సీఎం జిల్లాల పర్యటన, ఈ నెల 23 నుంచి మొదలవుతుంది. ఈ నెల 23న వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా కొత్త కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.

వనపర్తిలో కొత్త మార్కెట్‌ యార్డు, రెండు పడకల గదుల ఇళ్ల ప్రారంభంతో పాటు వైద్యకళాశాల, నర్సింగ్‌ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల పథకం, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. 

నూతన ఎమ్మెల్సీలకు అభినందన.. 
గవర్నర్‌ కోటాలో ఇటీవల శాసన మండలికి ఎన్నికైన అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మదుసూధనాచారితో పాటు స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీను సీఎం అభినందించారు. ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ఎల్‌.రమణ, తాతా మధు, డాక్టర్‌ యాదవరెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌ను కలిశారు.

బ్రీవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గా నియమితులైన గజ్జెల నగేశ్‌.. ముఖ్యమంత్రికి సాష్టాంగ నమస్కారం చేయగా, కార్పొరేషన్లకు నామినేట్‌ అయిన ఎర్రోళ్ల శ్రీనివాస్, సాయిచంద్, దూదిమెట్ల బాలరాజు తదితరులను కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందించారు.   

మరిన్ని వార్తలు