జోష్‌లో కాంగ్రెస్‌.. రచ్చబండతో మరింత బలపడేనా?

5 Sep, 2022 17:21 IST|Sakshi

ఇక వరంగల్ రైతు డిక్లరేషన్ సభతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ రచ్చబండతో గ్రామస్థాయిలో బలపడే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ కృషితో పార్టీ బలం కాస్త పెరుగుతున్నా..దానికి ఆదిలోనే గండికొట్టేలా కమలం, కారు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ బలం కాస్త పెరుగుతున్నట్లనిపిస్తున్నా..గ్రూప్ రాజకీయాలే ఆ పార్టీ కొంపముంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగితే కచ్చితంగా మూడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉన్న ములుగుతో పాటు అభ్యర్థులను బట్టి నర్సంపేట, భూపాలపల్లిలో‌ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉండడంతో మూడు ప్రధాన పార్టీలు రహస్య వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీంతో ఓరుగల్లులో ఎవరు ఎటువైపో.. ఎప్పుడు ఎక్కడుంటారో అంతుచిక్కడం లేదు. ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయనే మాట మాత్రం వినిపిస్తోంది.

వరంగల్ జిల్లాలో కాలానికి అనుగుణంగా రాజకీయ పార్టీల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయనే నానుడిని నిజం చేసేలా రాజకీయాలు సాగుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు రాజకీయాలు చేస్తున్నాయి. 

గ్రేటర్ వరంగల్ లోని పశ్చిమ నియోజకవర్గం టిఆర్ఎస్‌కు కలిసొచ్చే స్థానంగా చెప్పుకోవాలి. పశ్చిమ నుంచి అసెంబ్లీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ ఇప్పటికే నాలుగుసార్లు గెలిచి ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక్కడ మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ టిఆర్ఎస్ హవానే కొనసాగే పరిస్థితులు ఉన్నాయి.‌ 2009 నుంచి వినయ్ భాస్కర్‌కు ఎదురులేదనే చెప్పాలి.‌వినయ్ భాస్కర్ కు సీఎం కేసీఆర్ మంత్రి కేటిఆర్ ఆశిస్సులు ఉన్నాయి. వాటికి తోడు కాంగ్రెస్, బిజేపి లోని గ్రూప్ రాజకీయాలు వినయ్ భాస్కర్ కు అనుకూలంగా మారుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికలు వినయ్ భాస్కర్ కి అంత ఈజీ కాదనే చర్చ సాగుతుంది.

ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున నాయిని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ పోటీకి సిద్ధమవుతున్నారు. రాజేందర్ రెడ్డి ప్రస్తుతం హన్మకొండ , వరంగల్ జిల్లాలకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2018లో ఇక్కడి నుండి పోటీ చేద్దామనుకున్న రాజేందర్ రెడ్డికి నిరాశే ఎదురైంది. పొత్తులో భాగంగా ఈ స్థానం టీడీపీ కి ఇవ్వడంతో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన రాహుల్ గాంధీ వరంగల్ బహిరంగ సభ సక్సెస్తో‌ రేవంత్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ వేం నరేందర్ రెడ్డి సైతం వరంగల్ పశ్చిమపై కన్నేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి మొత్తం నలుగురు టిక్కెట్ ఆశిస్తుండగా.. టిక్కెట్ రానివారు ఇతర పార్టీల్లోకి మారడం లేదా సైలెంట్ గా ఉండి కాంగ్రెస్ అభ్యర్థి ని ఓడించడమే లక్ష్యంగా పావులు కలిపే అవకాశాలు లేకపోలేదు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు పెంచుకుంటున్న బీజేపీ నుంచి పోటీకి ముగ్గురు రెడీ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు , హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు