Telangana Congress: ఉత్తమ్ ముసుగు వీరుడు.. కాంగ్రెస్, రేవంత్‌ను బలహీనపరిచే కుట్ర..

18 Dec, 2022 18:34 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం ముదిరిన వేళ అసంతృప్త సీనియర్ నేతలపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎల్పీ, మాజీ పీసీసీ సహా ఇతర నేతలు రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను, రేవంత్‌ను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ముసుగు వీరుడని అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  గూడూరు నారాయణ రెడ్డిని బీజేపీలోకి పంపించిందే ఉత్తమ్ అని ఆరోపించారు. సీనియర్ నేత పొన్నాలకు టికెట్‌ రాకుండా అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారని పేర్కొన్నారు. సీఎల్పీ పదవి రాలేదని తెలంగాణలో కాంగ్రెస్‌ను ఉత్తమ్ నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డికి ఆయన రూ.8కోట్లు ఇచ్చారని అన్నారు. కోవర్టుగా పనిచేసినందుకే కౌశిక్ టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ అయ్యారని పేర్కొన్నారు. కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కోవర్టా కాదా? అని ప్రశ్నించారు.

ఈ నెల 26 నుంచి పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ ప్రాణాళికలు సిద్ధం చేస్తుంటే.. దాన్ని దెబ్బ తీయాలని కొందరు సొంతపార్టీ నేతలు చూస్తున్నారని అనిల్ ఆరోపించారు. పార్టీ ముగుసు వీరులు ఇప్పుడు బయటకు వచ్చారని పేర్కొన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు సేవ్ కాంగ్రెస్ ఎందుకు గుర్తుకు రాలేదని అనిల్ ప్రశ్నించారు. ఆనాడు పీసీసీగా ఉన్నవాళ్లు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఉత్తమ్ ఏం చేశారని ప్రశ్నించారు. సీనియర్లంతా పార్టీకోసం పనిచేస్తే మునుగోడులో 50వేల ఓట్లతో కాంగ్రెస్ గెలిచేదని వ్యాఖ్యానించారు.

కాగా.. పీసీసీ కమిటీల్లో టీడీపీ వచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన 12 మంది నేతలు పదవులకు రాజీనామా చేశారు.
చదవండి: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు 13 మంది రాజీనామా

మరిన్ని వార్తలు