Congress Party: అంతా రేవంత్‌ ఇష్టమేనా? ఇలానే ఉంటే ఎవరూ మిగలరు!

30 Nov, 2022 01:27 IST|Sakshi
భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ 

పార్టీ మరింత బలహీనపడుతుంది 

టీపీసీసీ నియామకాల్లో జోక్యం చేసుకోండి 

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందు తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మొర 

ఖర్గేతో ఉత్తమ్, భట్టి, మహేశ్వర్‌ రెడ్డి, పొన్నం, 

షబ్బీర్‌ అలీ, వంశీచంద్‌ విడివిడిగా భేటీలు 

రేవంత్‌పై కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పునర్వ్యవస్థీకరణ, కార్యవర్గ ఏర్పాటుపై తీవ్ర కసరత్తు జరుగుతున్న వేళ.. కాంగ్రెస్‌ నేతల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇన్‌చార్జ్‌లకు అనేక ఫిర్యాదులు చేసిన పార్టీ నేతలు తమ ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నారు.

మంగళవారం ఢిల్లీలో ఖర్గేను కలిసినప్పుడు సైతం తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీల ఏర్పాటు, రేవంత్‌ ఏకపక్ష నిర్ణయాలపై నేతలు తీవ్ర అభ్యంతరాలు తెలిపినట్లు సమాచారం. కమిటీల్లో, కార్యవర్గంలో ఇష్టారీతిన సొంతవారికే పదవులు కట్టబెడితే కాంగ్రెస్‌ పార్టీలో ఎవరూ మిగలరనే విధంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు స్పష్టంచేసినట్లు తెలిసింది.  

సీనియర్లను కాదని సొంత మనుషులకే పెద్దపీట  
తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్వర్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్‌ అలీ, వంశీచంద్‌ రెడ్డి మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యవర్గ ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. కార్యవర్గ ఏర్పాటులో రేవంత్‌ సొంత నిర్ణయాలు, సీనియర్లపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పార్టీలో నేతల మధ్య సమన్వయలోపం తదితర అనేక విషయాలను ఖర్గే దృష్టికి సీనియర్లు తీసుకెళ్లినట్లు సమాచారం.

కమిటీల్లో పార్టీ సీనియర్లను కాదని, జూనియర్‌ నేతలు, టీడీపీ నుంచి వచ్చిన నేతలు, సొంత మనుషులకే రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్న విషయం తమకు తెలిసిందంటూ ఖర్గేకు సదరు నేతలు చెప్పినట్టు సమాచారం. ఈ పరిణామాలు తెలంగాణలో పార్టీ భవిష్యత్తుకు ఏమాత్రం క్షేమకరం కాదని ఖర్గేకు స్పష్టంచేసినట్లు తెలిసింది. తెలంగాణలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర పూర్తయిన తరువాత... ఇప్పటివరకు కూడా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరికీ అందుబాటులో లేరని ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

అలాగే పార్టీకి సంబంధించిన అనేక కీలక విషయాల్లో సీనియర్ల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవట్లేదని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్‌ తీరుతో పార్టీలో ఎవరూ మిగులరని, ఈ దృష్ట్యా కమిటీల ఏర్పాటు, పార్టీలో నేతల మధ్య సమన్వయం, రేవంత్‌ ఏకపక్ష నిర్ణయాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని నేతలు పార్టీ అధ్యక్షుడికి మొరపెట్టుకున్నట్లుగా తెలిసింది. దీనిపై స్పందించిన ఖర్గే రేవంత్‌ను పిలిపించుకొని అన్ని అంశాలపై మాట్లాడుతానని హామీ ఇచ్చారని చెబుతున్నారు.

అంతర్గత విషయాలు చర్చించాం: భట్టి 
ఈ భేటీ అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మల్లికార్జున ఖర్గేతో పార్టీ అంతర్గత విషయాలు మాత్రమే చర్చించుకున్నామని, కమిటీల అంశం తనకు తెలియదని దాటవేశారు. పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ నాయకులందరూ కలిసి పనిచేసేలా చూడాలని ఖర్గేను కోరానని తెలిపారు. షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్‌లో అంతా బాగుందని.. రేవంత్‌ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. అంతేగాక పార్టీలోని సీనియర్లలో ఎలాంటి అసంతృప్తి లేదని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు