మెంబర్‌‘షిప్‌’ కదలట్లేదు.. టార్గెట్‌ 30 లక్షలు.. జరిగింది 2.5 లక్షలే

21 Dec, 2021 10:34 IST|Sakshi

నత్తనడకన కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు.. జనవరి 26 నాటికి లక్ష్యం 30 లక్షలు

నల్లగొండ, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓ మోస్తరు

హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, మెదక్‌ స్థానాల్లో ముందుకు సాగని ప్రక్రియ

చురుగ్గా పాల్గొనని స్థానిక నేతలపై వేటుకు టీపీసీసీ యోచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ సభ్యత్వనమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నవంబర్‌ ఒకటిన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రెండున్నర లక్షలమంది మాత్రమే సభ్యులుగా చేరారు. వచ్చేఏడాది జనవరి 26తో ఈ ప్రక్రియ ముగియనుంది. గడువు వరకు 30 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించాలని టీపీసీసీ లక్ష్యం పెట్టుకుంది. 20 రోజుల క్రితమే లోక్‌సభ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జీల నియామకం పూర్తయినప్పటికీ ఆ ప్రక్రియ ఇంకా గాడిన పడలేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. పార్టీకి పట్టున్న లోక్‌సభ స్థానాల పరిధిలోనూ అంతంత మాత్రంగానే జరుగుతుండటం గమనార్హం.  

హజరుకాని నేతలు...: సభ్యత్వ నమోదు ప్రక్రియపై సోమవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి మహేశ్‌ కుమార్‌గౌడ్, డిజిటల్‌ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీలు హర్కర వేణుగోపాల్, దీపక్‌ జాన్‌లు హాజరై పార్లమెంటు స్థానాలవారీగా ప్రక్రియను సమీక్షించారు. పలు పార్లమెంటరీ స్థానాల ఇన్‌చార్జీలు ఏఆర్‌జీ వినోద్‌రెడ్డి, గోపిశెట్టి నిరంజన్, సిరిసిల్ల రాజయ్య, సంభాని చంద్రశేఖర్, రాములు నాయక్, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరు కాగా మిగతా ఏడుగురు ఇన్‌చార్జీలు డుమ్మాకొట్టారు. సభ్యత్వ నమోదులో ఎదురవుతున్న సమస్యలు, సాంకేతిక ఇబ్బందుల గురించి సమావేశంలో చర్చించారు. త్వరలోనే అసెంబ్లీ స్థాయి కోఆర్డినేటర్లను నియమించాలని, సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనని స్థానికనేతలపై అవసరమైతే వేటు వేయాలని నిర్ణయించారు. 
చదవండి:
నాకు జీవం లేదు.. 4 రోజుల క్రితమే చనిపోయాను: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

నల్లగొండ, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో కొంత చురుగ్గానే సభ్యత్వ నమోదు సాగుతోంది. నాగర్‌కర్నూల్‌లో 23 వేలు, మల్కాజ్‌గిరిలో 20 వేలు, నల్లగొండ, మహబూబాబాద్‌లలో 18 వేల చొప్పున సభ్యత్వాలు పూర్తయ్యాయి. సభ్యత్వనమోదు కోసం మండల స్థాయి ఇన్‌చార్జీల నియామకంలో నల్లగొండ స్థానం ముందుంది. కానీ, హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్‌ స్థానాల పరిధిలో ఇప్పటివరకు కనీసం వెయ్యిమందిని కూడా చేర్పించకపోవడం గమనార్హం. సభ్యత్వనమోదు ఇప్పుడే గాడిలో పడుతోందని, జనవరి 26 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి మహేశ్‌కుమార్‌గౌడ్‌ ‘సాక్షి’కి చెప్పారు.  

మరిన్ని వార్తలు