గుర్రపు బండిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

28 Sep, 2021 00:55 IST|Sakshi
గుర్రపు బండిపై వచ్చిన తమను అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న సీతక్క, భట్టి, జీవన్‌రెడ్డి,  శ్రీధర్‌బాబు 

అసెంబ్లీ లోపలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు 

రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన నేతలు 

భట్టి సహా నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అరెస్ట్‌ 

సోమవారం సభకు హాజరు కాలేకపోయిన వైనం 

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్‌బంద్‌లో భాగంగా సోమవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాంధీభవన్‌ నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండి ఎక్కి వచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క ఇందులో పాల్గొన్నారు. అయితే అసెంబ్లీ ముందుకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు.

గుర్రపుబండిలో అసెంబ్లీలోనికి వెళ్లేందుకు వీల్లేదనడంతో కాంగ్రెస్‌ నేతలు వాగ్వివాదానికి దిగారు. అసెంబ్లీ సమావేశాలకు ఎలా హాజరు కావాలన్నది తమ ఇష్టమని, తమను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో భట్టి సహా నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కారణంగా సోమవారం జరిగిన అసెంబ్లీ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాల్గొనలేకపోయారు.  

స్పీకర్, చైర్మన్‌ సమాధానం చెప్పాలి: భట్టి 
పోలీస్‌స్టేషన్‌ నుంచి వచ్చిన తర్వాత సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీకి ఎలా వెళ్లాలనేది సభ్యుల ఇష్టమని, తాము అసెంబ్లీకి హాజరు కాకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని భట్టి అన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా వెళ్లినా తమను అరెస్టు చేసిన విధానంపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

హక్కుల తీర్మానం ఇస్తాం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను టీఆర్‌ఎస్‌ ఆమోదిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్న దానిపై వివరణ ఇవ్వాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సభకు హాజరుకానివ్వకుండా తమ హక్కులను కాలరాసినందుకు అసెంబ్లీలో, మండలిలో హక్కుల తీర్మానం పెడతామని చెప్పారు.

శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎలా రావాలన్న దానిపై నిబంధనలు ఏమైనా ఉన్నాయేమో స్పీకర్, చైర్మన్‌లు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని జగ్గారెడ్డి విమర్శించారు. సీతక్క మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే, ప్రజలతో కలిసి పోరాడాల్సిన కేసీఆర్‌ ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు