ఆ రెండూ కలిసే వడ్ల నాటకం

23 Mar, 2022 03:24 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న రేవంత్, కోమటిరెడ్డి 

టీఆర్‌ఎస్, బీజేపీలపై రేవంత్, కోమటిరెడ్డి ధ్వజం 

ప్రజలను మోసం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు 

ఛత్తీస్‌గఢ్‌ తరహాలో ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బోనస్‌ ఇవ్వాలి 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు చేతకాకుంటే పదవి నుంచి తప్పుకోవాలని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు తెలంగాణ ప్రజలను మోసం చేసేలా ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో అమలు చేస్తున్న మాదిరిగా ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధుతో రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగదని, పంటలకు అందించే మద్దతు ధరకు అదనంగా అందించే బోనస్‌తోనే లబ్ధి జరు గుతుందన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు. 

దొంగ సొమ్ము పంచుకోవడానికి ఇద్దరూ ఒక్కటే 
రాష్ట్రంలో దొంగ సొమ్ము పంచుకోవడానికి టీఆర్‌ ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టడానికి.. వడ్ల కోసం కొట్లాడుతున్నానని ఒకరు చెబుతుంటే, అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని మరొకరు అంటున్నారని ఎద్దేవా చేశారు.  

సింగరేణిపై సీబీఐ విచారణకు ఆదేశించాలి 
సింగరేణి సంస్థకు నైని బొగ్గు గని కేటాయింపు విషయంలో జరుగుతున్న అవకతవకల విషయంలో ప్రధానికి ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోవట్లేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ ప్రక్రియ జరుగుతున్నా, సింగరేణి సీఎండీ శ్రీధర్‌పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకో వట్లేదని, ఆయనను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.  టీఆర్‌ఎస్, బీజేపీలు కుమ్మక్కు కావడం వల్లే సింగరేణి కుంభకోణంపై విచారణ ప్రారంభించడం లేదని ఆరోపించారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.  

తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్‌లోనే: కోమటిరెడ్డి 
తాను పార్టీ మారుతున్నాననే వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు. సోషల్‌ మీడియాలో తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఒక ఇంట్లో ఎన్నో గొడవలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అలాగే కాంగ్రెస్‌ పార్టీలో గొడవలు సహజమని వ్యాఖ్యానించారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయన్నారు.    

మరిన్ని వార్తలు