భగ్గుమన్న కాంగ్రెస్‌ శ్రేణులు.. యువజన నేతపై దాడితో ఉద్రిక్తతలు

22 Feb, 2023 09:03 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: హనుమకొండలో యువజన కాంగ్రెస్‌ నాయకుడు తోట పవన్‌పై దాడి ఉత్కంఠ, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ దాడిని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగారు. దాడిలో గాయపడ్డ పవన్‌ను హనుమకొండలోని ఏకశిల ఆస్పత్రిలో మంగళవారం పరామర్శించిన రేవంత్‌ రెడ్డి.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా పోలీస్‌ కమిషనరేట్‌కు చేరుకున్నారు.

ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీస్‌ కమిషనరేట్‌ ముందు బైటాయించి ధర్నా చేశారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌పై హత్యా నేరం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పోలీసు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ని రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు.  

‘దాస్యం దద్దమ్మ’ ఫ్లెక్సీతోనే వివాదం.. 
రేవంత్‌ రెడ్డి చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర ఓరుగల్లులో అలజడి సృష్టించింది. హనుమకొండలో సోమవారం రాత్రి జరిగిన పాదయాత్ర, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో స్థానిక ఎమ్మెల్యేపై విడుదల చేసిన చార్జిషీట్‌తో ‘దాస్యం దద్దమ్మ’ ఫ్లెక్సీని యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు తోట పవన్‌ ప్రదర్శించారు. దీంతో ఆగ్రహించిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కొందరు స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ ముగియగానే దారికాచి పవన్‌పై దాడి చేశారు. తీవ్రగాయాలతో పవన్‌ స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ప్రథమ చికిత్స అనంతరం కొద్ది గంటలకు స్పృహలోకి వచ్చిన పవన్‌ తనను హతమార్చేందుకే బీఆర్‌ఎస్‌కు చెందిన రంజిత్‌ రెడ్డి, రాజ్‌కుమార్, అభిలతోపాటు సుమారు 15 మంది దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్‌ అపోలోకు పవన్‌.. పోలీసుల అదుపులో ఐదుగురు...? 
పవన్‌ ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని డాక్టర్లు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా సీపీ రంగనాథ్‌ ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్న ప్రత్యేక బృందాలు పవన్‌పై దాడి ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని 
అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేతలకు వివరించారు. చట్టపరంగా విచారణ జరిపి త్వరలోనే 
నిందితులందరినీ గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు రేవంత్‌ రెడ్డి పిలుపు.. 
పోలీస్‌ కమిషనరేట్‌ ఎదుట రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాడి వెనుక ఎమ్మెల్యే దా­స్యం వినయ్‌భాస్కర్‌ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. హత్యాయత్నం చేసిన బీఆర్‌ఎస్‌ నాయకు­ల ఫోన్‌లను సీజ్‌ చేయాలని, రక్త నమూనాలు సేకరించి గంజాయి మత్తు నిగ్గు తేల్చాలని డిమాం­డ్‌ చేశారు. దాడులతో రాజకీయం చేయాలంటే డేట్‌ డిసైడ్‌ చేయండంటూ సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌ విసిరారు. పాదయాత్ర దగ్గర దాడి అంటేనే... కాంగ్రెస్‌ పార్టీపై, నేతలపై జరిగిన దాడిలా చూడాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీ, ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ విభాగాలు ఈ దాడిని సీరియస్‌గా తీసు­కుని గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో నిరసన, ధర్నాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
చదవండి: బెల్ట్‌ షాపులుంటే బట్టలూడదీసి బొక్కలో వేయిస్తా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు