కాంగ్రెస్‌కు గుడ్‌బై.. మర్రి శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

22 Nov, 2022 12:32 IST|Sakshi

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. చాలా బాధతో కాంగ్రెస్‌ పార్టీతో బంధం తెంచుకుంటున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. తెలంగాణ బాగు కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

కాగా.. కాంగ్రెస్‌కు కేన్సర్ సోకిందని ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు మర్రి శశిధర్ రెడ్డి. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆయనను పార్టీ అధిష్ఠానం ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది.

25 లేదా 26న బీజేపీలోకి..
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అస్తిత్వం కోల్పో­యిందని, సరైన నాయ­కత్వం లేకనే ఈ పరిస్థితి దాపురించిందని శశిధర్‌రెడ్డి  సోమవారమే అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారిని పట్టించుకోకపోవడం వల్లే తాను బయటకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన శశిధర్‌ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్లు, మైనారిటీ నేతలతో బేగంపేటలోని తన కార్యాలయంలో సోమవారం సమా వేశమ­య్యారు. తాను బీజేపీలో చేరాలనే నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు.

టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని, బీజేపీ మాత్రమే  మైనార్టీల అభివృద్ధికి పాటుపడుతోందని, తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఈ నెల 25 లేదా 26వ తేదీల్లో ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు.
చదవండి: బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలతో జాగ్రత్త.. కాంగ్రెస్‌ ఉనికికే ప్రమాదం

మరిన్ని వార్తలు