ముగిసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల భేటీ

14 Mar, 2022 20:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు వీహెచ్‌, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పలువురు భేటీ అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం సీనియర్‌నేత వీ. హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో జరిగిన పరిణామాలపై చర్చించామని, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై మాట్లాడినట్లు తెలిపారు. అధిష్టానం దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తామని అన్నారు.

మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో సంస్థాగతమైన మార్పులు జరగాలని వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరారని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం రావాలని దానిపై చర్చించామని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న వారు.. పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని అన్నారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు సమావేశంలో బయట జరుగుతున్న ఊహాగానాలు ఏమి లేవని, ఆదివారం సోనియా గాంధీ  ఏర్పాటు చేసిన సమావేశంపై చర్చించామని పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని చర్చించామని తెలిపారు. ఆ కుటుంబం అడుగుజాడల్లో కార్యకర్తలు నడుస్తారని అన్నారు. పార్టీతో కొన్ని ఏళ్లుగా అనుబంధంగా కొనసాగుతున్న నేతలుగా చర్చించుకున్నామని చెప్పారు. ఢిల్లీ సమావేశం పైనే చర్చించామని, వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్‌కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పని చేయాలనే దానిపై మాట్లాడినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు