పోటీకి వెనకడుగు.. ప్లాన్‌ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

30 Apr, 2023 19:33 IST|Sakshi

వాళ్ళంతా పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లు.. హస్తం పార్టీ తమవల్లే చాలాసార్లు గెలిచిందంటారు. తమను గౌరవించాలని.. మాట వినాలని డిమాండ్ చేస్తారు. కాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ సీనియర్లలో చాలా మంది వెనకాడుతున్నారు. పోటీ చేయకుండా కొత్తవారికి అవకాశం ఇస్తారా అంటే.. కుదరదంటారు. అసలు టీ.కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? పోటీకి వెనకాడుతున్న నాయకులెవరు?

తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు ఎన్నికలు అంటేనే భయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము నెట్టుకురాగలమా అని ఆందోళన చెందుతున్నారట. పాలిటిక్స్ గతంలో మాదిరిగా లేవు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగింది. దీంతో నేతలు ఎన్నికలంటేనే భయపడుతున్నారు. కొందరు నేతలు అక్కడా.. ఇక్కడా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్టేట్మెంట్స్ ఇస్తున్నారట. దీంతో కొందరు సీనియర్ల వ్యవహారం పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.

పార్టీ కార్యక్రమాల్లో తామే ముందుండాలని, తమకు ప్రత్యేక ఆసనాలు వేయాలని కోరుకునే సీనియర్లు ఎన్నికలంటే భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. రేణుక చౌదరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి నేతలు సైతం ఎన్నికలు అనే సరికి వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలంతా వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో ఎన్నికలు అనే సరికి భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు కొందరు.

వారసుల కోసం..
సిటింగ్‌ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ అంటేనే భయమేస్తోందని కామెంట్‌ చేశారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సైతం ఎన్నికలు అంటేనే భయపడుతున్నారట. దామోదర తన కూతురుని పోటీలో ఉంచితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు సైతం వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారట. జానారెడ్డి లాంటి నేతలు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చి కొడుకులను రంగంలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు.

పొన్నాల లక్ష్మయ్య సైతం కోడలు వైశాలిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనే యోచన చేస్తున్నారట. మాజీ ఎంపీ రేణుక చౌదరి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా సీనియర్ లు అని చెప్పుకునే నేతలు సైతం ఎన్నికలు అంటే జంకుతున్నారు. కాని పోటీకి దూరం అని చెప్తున్నప్పటికీ ఈ నేతలెవరు తమ నియోజకవర్గంలో మరో నేతకు అవకాశం ఇవ్వడం లేదు. తమ వారసులనే బరిలో దించాలని ఉబలాటపడుతున్నారు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఖర్చు భారీగా పెరిగింది. దీంతో పాటు చాలా మంది కొత్త నేతలు వెలుగులోకి వచ్చారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఓ యువనేతపై ఓడిపోవడం సీనియర్లను కలవర పెడుతోంది. కొత్త ఓటర్లతో.. సీనియర్ నేతలకు వచ్చిన గ్యాప్ పూడ్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే వారు ఎన్నికలంటే భయపడే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోటీకి దూరం అనేది నిజమా? లేక ఏదైనా ఎత్తుగడతో ఇలా అంటున్నారా? అనేది నిదానంగా కాని తేలదు.
చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్‌లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్‌

మరిన్ని వార్తలు