టార్గెట్‌.. 76 వేల ఓట్లు

14 Sep, 2022 02:21 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మాణిక్యం ఠాగూర్‌. చిత్రంలో ఉత్తమ్, రేవంత్‌ 

మునుగోడులో గెలిచేందుకు కాంగ్రెస్‌ వ్యూహం

రెండు బూత్‌లకో ఇన్‌చార్జి

10 బూత్‌లకు ఒక క్లస్టర్‌ ఇన్‌చార్జి

మండలానికో టీపీసీసీ నేత

టీపీసీసీ సమీక్షా సమావేశంలో నిర్ణయం

చౌటుప్పల్‌ రూరల్‌: ‘మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు 90 రోజులకుపైగా సమయం ఉంది. రెండు బూత్‌లకో ఇన్‌చార్జిని, పది బూత్‌లకో క్లస్టర్‌ ఇన్‌చార్జిని, మండలానికో టీపీసీసీ నేతను పెట్టాం. వచ్చే వారం రోజుల్లో గ్రామాలవారీగా తిరగాలి. 25 మంది సభ్యులతో బూత్‌ కమిటీని వేయాలి. అందులోంచి ఇద్దరు యువకులను గుర్తించాలి. వారి సాయంతో ఓటరు లిస్టు ఆధారంగా కాంగ్రెస్‌ కుటుంబాలను గుర్తించాలి.

కనీసంగా బూత్‌కు 254 ఓట్లను సాధించాలి. ఈ లెక్కన మునుగోడులో మొత్తంగా 76 వేల ఓట్లువస్తే కాంగ్రెస్‌ విజయం సాధిస్తుంది’అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ కాంగ్రెస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దామెరలో మంగళవారం టీపీసీసీ సమీక్షా సమావేశం జరిగింది. టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్‌ జావేద్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జె.గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ్మ, సంపత్‌కుమార్, షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, అంజన్‌కుమార్‌యాదవ్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, పాల్వాయి స్రవంతితో పాటు 107మంది బూత్‌ ఇన్‌చార్జిలతో ఉప ఎన్నికపై సమీక్షించారు. 

కాంగ్రెస్‌ ఓటర్లను గుర్తించాలి..
ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్‌ మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఉప ఎన్నికలకు 22 రోజుల గడువు మాత్రమే ఉండే. అక్కడ కూడా ఇలాగే పనిచేసినం. 26వేల ఓట్లు వచ్చాయి. కానీ, ఆరు బూతుల్లోనే మెజారిటీ ఓట్లు సాధించినం. ఆ బూత్‌ ఇన్‌చార్జులకు తగిన గుర్తింపునిచ్చాం, పార్టీ పదువులిచ్చినం. మునుగోడులోనూ పనిచేసిన వారికి గుర్తింపునిస్తాం. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌కు 76వేల ఓట్లు వచ్చాయి.

బూత్‌కు కనీసంగా 254 ఓట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ నెల 18 నుంచి బూత్‌ ఇన్‌చార్జులంతా కార్యక్షేత్రంలోకి దిగాలి. బూత్‌లవారీగా కాంగ్రెస్‌ ఓటర్లను గుర్తించాలి. వారం రోజుల్లోగా ఇదంతా పూర్తి చేయాలి. ఈ నెల 25న మరోసారి మండలాల వారీగా సమీక్షిస్తాం. కాంగ్రెస్‌ నుంచి పదవులు అనుభవించి వెళ్లిపోయిన రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ది చెప్పాలి. రాష్ట్రంలో 13రోజుల పాటు సాగే రాహుల్‌గాంధీ జోడో యాత్రను విజయవంతం చేయాలి’అని ఠాగూర్‌ కోరారు. సమావేశంలో ఇంకా టీపీసీసీ నాయకులు విజయరమణారావు, గండ్ర సత్యనారాయణ, అనిల్‌కుమార్, ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు