రాహుల్‌ సారథ్యం వహించాలి

17 Mar, 2022 03:40 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న భట్టి. చిత్రంలో సీతక్క, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి 

గాంధీ కుటుంబ నాయకత్వమే శ్రీరామరక్ష  

సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం 

రాజగోపాల్‌ రెడ్డి గైర్హాజరు 

సాక్షి. హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సారథ్య బాధ్యతలను అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టాలని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ) తీర్మానించింది. సోనియా, రాహుల్‌ల నాయకత్వమే అటు దేశా నికి, ఇటు పార్టీకి శ్రీరామరక్ష అని, గాంధీ–నెహ్రూ ల కుటుంబమే పార్టీ బాధ్యతలు తీసుకుని కేడర్‌ను ముందుకు నడపాలని కోరింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్కలు హాజ రు కాగా, నియోజకవర్గ పర్యటనలో ఉన్న మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాజరు కాలేదు. సమావేశంలో భాగంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, సీడబ్ల్యూసీ సమావేశంలో జరిగిన చర్చ, జీ–23 నేతల వ్యాఖ్యలు, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ చర్చ అనంతరం సోనియా, రాహుల్‌ల నాయకత్వంపై విశ్వాసం ప్రకటిస్తూ తెలంగాణకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల పక్షాన తీర్మానం చేశారు. ఈ తీర్మాన ప్రతిపై భట్టి విక్రమార్క, టి.జీవన్‌రెడ్డిలు సంతకాలు చేశారు.  

అసెంబ్లీలో సమయం ఇవ్వలేదు 
బడ్జెట్‌ సమావేశాలపై చర్చిస్తూ.. ప్రజల పక్షాన మాట్లాడేందుకు కాంగ్రెస్‌ పార్టీకి తగిన సమయం ఇవ్వలేదని, అటు స్పీకర్‌ సహకరించలేదని, ఇటు మంత్రులు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రెచ్చగొట్టేలా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఇటీవల మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సీనియర్లు భేటీ కావడం, ఈ భేటీకి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలు హాజరుకావడంపై ఎమ్మెల్యే సీతక్క ఆరా తీసినట్టు తెలిసింది.   

సోనియా, రాహుల్‌పై విమర్శలు తగవు: భట్టి 
సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి భట్టి విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు వచ్చినా సోనియా, రాహుల్‌లు ఆ పదవిని వద్దనుకుని దేశం కోసం నిలబడ్డారని చెప్పారు. కపిల్‌ సిబాల్‌ లాంటి నాయకులు సోనియా, రాహుల్‌లపై విమర్శలు సరికావన్నారు. 1970లో అధికారాన్ని కోల్పోయి 1980లో పూర్వ వైభవం సంతరించుకున్న తరహాలోనే 2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ హవా 2023– 24లో దేశంలో వీస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పారు.  

మరిన్ని వార్తలు