బీజేపీని ఓడించేందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతు

5 Sep, 2022 04:28 IST|Sakshi
తమ్మినేని వీరభద్రం 

ఉప ఎన్నిక వరకే సహకారం.. ఆ తర్వాత పరిస్థితులను బట్టి.. 

కూసుమంచి: మతతత్వ పార్టీ అయిన బీజేపీకి తాము వ్యతిరేకమని, ఆ పార్టీని తెలంగాణలో నిలువరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని, ఈ క్రమంలోనే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లిలో విలేకరులతో మాట్లాడారు.

మునుగోడులో టీఆర్‌ఎస్‌– బీజేపీ మధ్యే గట్టి పోటీ ఉందని భావించి, తమతోపాటు సీపీఐ కూడా టీఆర్‌ఎస్‌కు సహకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో అక్కడ సీపీఐ ఐదుసార్లు గెలిచినా, ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసినా ప్రధాన పార్టీలను ఎదుర్కొనేశక్తి లేదని, అందుకే ఓట్లు చీలకుండా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. కాంగ్రెస్‌ కూడా తమ మద్దతును కోరినప్పటికీ బీజేపీని అడ్డుకునే శక్తి టీఆర్‌ఎస్‌కే ఉందని భావించామన్నారు.

టీఆర్‌ఎస్‌కు తమ సహకారం ఈ ఎన్నిక వరకే పరిమితమని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కానందునే తాను రాజీనామా చేశానని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పడం సరైంది కాదన్నారు. తెల్దారుపల్లిలో వ్యక్తిగత కారణాలతోనే తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురయ్యారని, ఈ ఘటనకు, సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కృష్ణయ్య హత్య నేపథ్యంలోనే తాము టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నామనడం అవాస్తవమని కొట్టిపారేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.

మరిన్ని వార్తలు