ఇక్కడి రైతులను పంజాబ్‌ సీఎం ఆదుకుంటారా? 

21 May, 2022 02:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు తమ రక్తమాంసాలతో నింపే ప్రభుత్వ ఖజానా నుంచి పంజాబ్‌ రైతులకు సాయం చేస్తానని సీఎం కేసీఆర్‌ వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని, వారిని కేసీఆర్‌ ఆదుకునేందుకు వెళితే తెలంగాణ రైతులను పంజాబ్‌ సీఎం ఆదుకుంటారా? అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఢిల్లీలో పంజాబ్‌ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు ఒక్కరోజు కూడా వారికి కేసీఆర్‌ సంఘీభావం తెలపలేదన్నారు.

శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్‌తో కలసి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిలో వెయ్యిమందికి మాత్రమే ఆర్థికసాయం చేశారన్నారు. రుణమాఫీ అమలు కావడంలేదని, పంటల బీమా లేదని, ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నా 40 శాతం కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని ధ్వజమెత్తారు. వీటిని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి జరిగే ‘పల్లెపల్లెకు కాంగ్రెస్‌’ కార్యక్రమంలో వివరిస్తామని, వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తామని శ్రవణ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు