ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై డీకే అరుణ ఆగ్రహం

5 May, 2021 22:15 IST|Sakshi

సాక్షి, గద్వాల: కరోనా వైరస్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రంలో కరోనా బాధితులకు బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ పేర్కొనడం శోచనీయం అని పేర్కొన్నారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉండడంతో పాటు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని తెలపడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జిల్లా కేంద్రం గద్వాలలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ.. ‘క్షేత్రస్థాయిలో కరోనా బారిన పడి ప్రజలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా బారిన పడిన ప్రజలకు  నాణ్యమైన చికిత్సతో పాటు నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మీడియాలో వస్తున్న వార్తలు పరిస్థితి ఏ స్థితిలోకి జారిపోయిందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన ఆక్సిజన్, బెడ్లు, మందుల కొరత తీర్చి ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఉంది’ అని తెలిపారు.

చదవండి: ‘కేసీఆర్‌ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’
చదవండి: ఆక్సిజన్‌ కొరత లేదు.. కరోనా కంట్రోల్‌లోనే: సీఎస్‌

మరిన్ని వార్తలు