బెంగాల్‌ కాదిది.. తెలంగాణ

20 Dec, 2021 04:32 IST|Sakshi

అక్కడి ఫార్ములా ఇక్కడ పనిచేయదు: ఈటల 

మెదక్‌ మున్సిపాలిటీ: ‘పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని అణచివేసేందుకు మమతా బెనర్జీ అమలు చేసిన ఫార్ము లా ఇక్కడ అమలుచే యాలనుకుంటున్నారా? ఇది బెంగాల్‌ కాదు.. తెలంగాణ’అని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం మెదక్‌కు వచ్చిన ఆయన స్థానిక ప్రభుత్వ అతిథి విలేకరులతో మాట్లాడారు. రాష్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి బీజేపీ కార్యకర్తలపై భౌతికదాడులు చేయాలనడం దారుణమన్నారు.

పూటకోమాట మాట్లాడుతున్న కేసీఆర్‌ తీరు చూసి టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 40 ఏళ్ల నుంచి బీజేపీ జెండా కోసం, పార్టీ కోసం లక్షలాది మంది కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారని, అలాంటి పార్టీ మీద చిల్లర వేషాలు వేస్తే తెలంగాణ సమాజం భగ్గుమంటుందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై సుముఖంగా లేరని తెలిపారు.

దేశంలోనే రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం అని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి, నేడు వరి వేస్తే ఉరి అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి ఒకసారి పత్తి పెట్టమంటడు. మరోసారి సన్న వడ్లు పెట్టమంటడు, ఇంకోసారి దొడ్డు వడ్లు వేయమంటడు. ఇప్పుడేమో వరే వద్దంటున్నరు’అని ఈటల ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి నేడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  

మరిన్ని వార్తలు