పొమ్మనలేక పొగపెట్టారు: ఈటల 

24 Oct, 2021 02:03 IST|Sakshi
తుమ్మనపల్లిలో మాట్లాడుతున్న ఈటల  

నన్ను వాడుకుని వదిలేశారు.. వెన్నుపోటు పొడిచారు..     

హుజూరాబాద్‌: ‘నాకు అవకాశాలిచ్చారు. తమ్ముడన్నారు. నా జీతం కూడా ఈటల రాజేందర్‌ ఇస్తారు అన్నవారు ఎందుకు గొంతు నులిమారు? ఎర్రబెల్లి, మల్లారెడ్డి, సబితాలాగా నేను మధ్యలో వచ్చిన వాణ్ణి కాదు. సొంత పార్టీ నేతల్ని కొన్న నీచపు పార్టీ టీఆర్‌ఎస్‌. నన్ను పొమ్మనలేక పొగపెట్టి వెన్ను పోటు పొడిచారు. 18 ఏళ్లు ఉద్యమంలో వాడుకుని తెలంగాణ వచ్చిన తర్వాత బయటికి పంపిం చిండు’ అని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆవేదన చెందారు.

శనివారం హుజూ రాబాద్‌ మండలం సింగాపూర్, మాందాడిపల్లి, చిన్నపాపయ్యపల్లి, తుమ్మనపల్లి, హుజూరాబాద్‌ పట్టణాల్లోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈటల మాట్లాడుతూ..తాను సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని, ప్రభుత్వసొమ్ము పేదలకు మాత్రమే చేరాలని అన్నానని చెప్పారు. రైతుబంధు డబ్బున్నవారికి ఇవ్వొద్దని, కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పడం తప్పా? అది ధిక్కారం అవుతుందా? అని నిలదీశారు.

‘పదవుల కోసం పెదవులు మూయవద్దు. జెండాకి ఓనర్లం అని చెప్పిన. అప్పటి నుంచే కేసీఆర్‌ రాసి రంపాన పెట్టిండు. కేసీఆర్‌ వారసత్వం ఎప్పుడు వస్తుందో నన్న ఆశతో అవమానాలు భరిస్తూ హరీశ్‌రావు అక్కడే ఉంటున్నార’ని అన్నారు. కేటీఆర్‌ ఈ ఎన్నికలు చిన్నవి అంటూ రూ.350 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  హుజూరాబాద్‌లో చార్జ్‌షీట్‌ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ తెలంగాణతల్లిని బందీని చేసి దోచుకుంటున్నారని, మోసం చేయడం ఆయన నైజమని విమర్శించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు