వడ్లు కొనాలి లేదా సీఎం పదవి నుంచి తప్పుకోవాలి

2 Apr, 2022 05:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు సెంటర్లను తెరిచి కొనుగోళ్లు ప్రారంభించాలని లేదంటే సీఎం కేసీఆర్‌ తన పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. పండించిన ప్రతి గింజా కొంటామని సీఎం ప్రజలకు గతంలో పదే పదే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు.

పెంచిన విద్యుత్, బస్‌ చార్జీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై నెపంమోపి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  శుక్రవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ 17 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు. కళ్ల ముందు నీళ్లు కనిపిస్తున్నా పంటలు వేయకుండా రైతులను కన్నీళ్ల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించకుండా సీఎం, ఆరోగ్య శాఖమంత్రి తప్పులు చేస్తే శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్‌ అనుభవించాలా? అని వరంగల్‌ ఘటనపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఈటల స్పందించారు.

మరిన్ని వార్తలు