పేదలను వదిలి.. ‘కార్పొరేట్‌’తో కలసి..

30 Apr, 2022 02:19 IST|Sakshi
జాకోరా సభలో మాట్లాడుతున్న హరీశ్‌  

బీజేపీపై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు మండిపాటు

ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది 

రైల్వేస్టేషన్‌లో చాయ్‌ అమ్మిన మోదీ ఇప్పుడు రైల్వేను అమ్మాలని చూస్తున్నారు 

కాంగ్రెస్‌ పార్టీది ఒడిసిన చరిత్ర.. రాహుల్‌గాంధీది ఐరన్‌లెగ్‌ అని విమర్శ 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: దేశంలో 80 శాతం మంది పేదలను వదిలేసి 20 శాతం మంది కార్పొరేట్‌ శక్తులు, బడాబాబుల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం ని జామాబాద్‌ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామం లో జాకోరా ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడేళ్లలో చేసిన అభివృద్ధి గత 70 ఏళ్లలో జరగలేదన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, ఇతర నీటిపారుదల పథకాల నిర్మా ణంతో తెలంగాణలో ధాన్యం దిగుబడి 99 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 2.59 కోట్ల మెట్రిక్‌ టన్నులకు పెరిగిందని చెప్పారు. ఇంత అభివృద్ధిని నమ్మని కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకుండా అన్యాయం చేస్తోందన్నారు.

కేంద్రం తెచ్చిన సాగు చట్టాలు అమలైతే రైతులు అంబానీ, అదానీల వద్ద కూలి పనులు చేయాల్సి వచ్చే దన్నారు. రైతులకిచ్చే వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టాలని కేంద్రం అడిగితే సీఎం కేసీఆర్‌ అంగీకరించలేదని, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం మీటర్ల ఏర్పాటుకు సంతకాలు పెట్టి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నారన్నారని వెల్లడించారు.  

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ.. 
బడుగుబలహీన వర్గాలు రిజర్వేషన్లు కోల్పోయేలా అంబేడ్కర్‌ ఆశయాలకు విరుద్ధంగా మోదీ ప్రభు త్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందన్నారు. రైల్వేస్టేషన్‌లో చాయ్‌ అమ్మిన మోదీ రైల్వేలను కార్పొరేట్‌ సంస్థలకు అమ్మేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారని విమర్శించారు. అందుకే రైల్వేల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదని, కేంద్రంలో మొత్తం 15 లక్షల 69 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.

ఇక ఎల్‌ఐసీని సైతం ప్రైవేటుపరం చేస్తున్నారని.. ఇందులో భారీ అవినీతి ఉందని వెల్లడించారు. విశాఖ ఉక్కు, బీపీసీఎల్‌ను సైతం అమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్‌ది ఒడిసిన చరిత్ర అని.. తన ఇల్లు చక్కబెట్టుకోదు గానీ తెలంగాణను ఉద్ధరిస్తాదట అని ఎద్దేవా చేశా రు. రాహుల్‌గాంధీది ఐరన్‌లెగ్‌ అన్నారు. ఈ సమా వేశంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. 

మూడున్నరేళ్లలో మల్లన్నసాగర్‌ పూర్తి చేసినం 
సాక్షి, కామారెడ్డి: ‘ప్రాజెక్టులు పూర్తికావన్నరు.. నీళ్లు రానేరావన్నరు.. అవినీతి మరకలు వేసిండ్రు.. కుట్రలు చేసిన్రు.. ఎవరెన్ని మాటలు మా ట్లాడినా సీఎం కేసీఆర్‌ దృఢసంకల్పం ముందు పనిచేయలేదు. కాంగ్రెస్, బీజేపీ నేతల అడ్డగోలు మాటలకు సమాధానమే మల్లన్నసాగర్‌ ప్రాజె క్టు. మూడున్నరేళ్లలో మల్లన్నసాగర్‌ను పూర్తి చేసినం.

మల్లన్నసాగర్‌ నుంచి నిజాంసాగర్‌కు పో యిన ఏడాది కొండపోచమ్మ ద్వారా నీళ్లు అందినయి. టన్నెల్‌ పనులు పూర్తికావస్తున్నయి. వచ్చే కొద్ది రోజుల్లో మల్లన్నసాగర్‌ నుంచి నిజాంసాగర్‌కు గోదావరి పరుగులు తీయనుంది’అని మంత్రి హరీశ్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రూ.50 కోట్ల వ్యయంతో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.

కాంగ్రెస్, బీజేపీ నేతలు కుక్కలు మొరిగినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.లక్ష అందిస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌తో 10 లక్షల మందికి మేలు జరిగిందన్నారు. సభలో ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, సురేందర్, హన్మంత్‌సింధే, ఎమ్మెల్సీ వీజీగౌడ్, దేశపతి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు