సుమన్‌ వేధింపులు భరించలేకే పార్టీ వీడాం 

23 May, 2022 00:46 IST|Sakshi
మాట్లాడుతున్న నల్లాల ఓదెలు దంపతులు   

చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు  

జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేయను: భాగ్యలక్ష్మి  

మందమర్రి రూరల్‌: ప్రభుత్వ విప్, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ వేధింపులు భరించలేకే తాము టీఆర్‌ఎస్‌ను వీడామని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి తెలిపారు. మందమర్రిలోని తమ నివాసంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లిపోవాలని బాల్క సుమన్‌ తమపై ఒత్తిడి చేశారని ఆరోపించారు.

‘నా భార్య, పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా.. విప్‌ వేధింపులు భరించలేకనే మేం టీఆర్‌ఎస్‌ను వీడాం’ అని నల్లాల ఓదెలు ఉద్వేగానికి లోనయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా భాగ్యలక్ష్మి కి సుమన్‌ ఏనాడూ గౌరవం ఇవ్వలేదన్నారు. కనీసం మహిళగానూ చూడలేదన్నారు. బాల్క సుమన్‌ నియంతలా వ్యవహరిస్తూ.. అక్రమాలపై ప్రశ్నించిన వారిని, ఎదురుతిరిగిన వారిపై పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తన కేడర్‌ బలంతోనే గెలిచిన సుమన్‌.. గెలిచిన తర్వాత తమను ఏ కార్యక్రమానికీ పిలవలేదన్నారు.

తన కొడుకులపై అక్రమకేసులు పెట్టిస్తానని, అరెస్ట్‌ చేయిస్తానని బెదిరించారని ఆరోపించారు. జాతీయ రహదారి కాంట్రాక్టర్‌ను బెదిరించి క్యాతన్‌పల్లిలో సుమన్‌ ఇల్లు కట్టించుకున్నారని చెప్పారు. సోనియాఆశీస్సులతో తాను ఎమ్మెల్యే అవుతానని  ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు వారి పదవికి రాజీనామా చేస్తే తానూ జెడ్పీటీసీ పదవికి, జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తానని భాగ్యలక్ష్మి తెలిపారు.  

మరిన్ని వార్తలు