బీజేపీ నాలుగో జాబితాపై కసరత్తు

4 Nov, 2023 05:28 IST|Sakshi

నేడు ఢిల్లీకి కిషన్‌రెడ్డి, ఇతర నేతలు

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికి మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ నాయకత్వం మిగిలిన 31 సీట్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ నేతలు ప్రకాష్‌ జవదేకర్, తరుణ్‌ చుగ్, అరవింద్‌ మీనన్‌ భేటీ అయ్యారు. జనసేన పొత్తు ప్రకటన దరిమిలా పార్టీలో వస్తున్న వ్యతిరేకతపై చర్చించినట్టు సమాచారం.

జనసేనకు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు సీట్లు, వేములవాడ, హుస్నాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారులో ఏర్పడిన చిక్కుముడిని విప్పడం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా శనివారం సాయంత్రం కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండిసంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లనున్నట్టు చెబుతున్నారు. జనసేనకు కేటాయించే సీట్లతో పాటు మిగిలిన సీట్లపై అక్కడ పెద్దలతో చర్చించనున్నారని అంటున్నారు. ఏదేమైనా రెండు రోజుల్లో నాలుగో జాబితా వెలువడవచ్చునని తెలుస్తోంది. ఆరేడు సీట్లలో పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చునని చెబుతున్నారు. మరో మూడు, నాలుగు రోజుల తర్వాత వీటిని ప్రకటించవచ్చునని అంటున్నారు. 

నేడు మేడిగడ్డకు కిషన్‌రెడ్డి, ఈటల బృందం.... 
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా.. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీలోనూ సమస్యలు ఏర్పడటం వంటి పరిణామాల నేపథ్యంలో శనివారం పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డా.కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్‌రావు అక్కడకు వెళ్లనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు అంబట్‌పల్లికి చేరుకుంటారు. 11.15 నుంచి గంట పాటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సందర్శిస్తారు. అక్కడి పరిస్థితులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 నిముషాలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.  

మరిన్ని వార్తలు