కేంద్ర నిధులతో కేసీఆర్‌ ప్రచారం: గిరిరాజ్‌సింగ్‌

3 Jul, 2022 02:20 IST|Sakshi
గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌   

గచ్చిబౌలి: కేంద్రం నిధులతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి సీఎం కేసీఆర్‌ ప్రచారం చేసుకుంటున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖమంత్రి గిరిరాజ్‌సింగ్‌ విమర్శించారు. శనివారం గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో బిహర్, జార్ఖండ్‌ రాష్ట్రాల సమ్మేళనంలో భాగంగా ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామ పంచాయతీల్లో శ్మశానవాటికల అభివృద్ధి, మొక్కలు నాటారని తెలిపారు. నిధులు ఇచ్చిన విషయం నిజం కాదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో బిహార్, జార్ఖండ్‌తో పాటు ఉత్తర భారతీయుల పాత్ర ఉందన్నారు. ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌లో అనేక మంది ఉత్తరాది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. బడ్జెట్‌తో పాటు ఆదాయ వనరులను పెంచడంలో కేంద్ర ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు గోపాల్‌ జీ ఠాకూర్, మనోజ్‌ తివారీ, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి యోగానంద్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు