కేంద్రం నిధులిస్తున్నా.. కేసీఆర్‌ సర్కార్‌ సహకరించడం లేదు..

27 Sep, 2022 07:36 IST|Sakshi

నాణ్యత లేకే బయ్యారం ఉక్కు కర్మాగారానికి కేంద్రం విముఖత 

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించలేదో టీఆర్‌ఎస్‌ చెప్పాలి 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కోసం కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో ఏమాత్రం సహకరించట్లేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే టీఆర్‌ఎస్‌ నాయకులు.. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ఇప్పటివరకు ఎందుకు తిరిగి ప్రారంభించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బయ్యారం ఉక్కు నాణ్యత సరిగా లేకనే కేంద్రం అక్కడ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు విముఖత చూపుతోందని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.  

భూసేకరణలో రాష్ట్ర సర్కారు విఫలం 
రాష్ట్రానికి కేంద్రం ప్రాజెక్టులు కేటాయించినా.. అవసరమైన భూమిని సేకరించి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమౌతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎట్టకేలకు వరంగల్‌ జిల్లాలోని ములుగులో గిరిజన వర్సిటీకి స్థలాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌ సైన్స్‌ సిటీతో పాటు వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌కు భూమి కేటాయించలేదని ఆరోపించారు. ఎంఎంటీఎస్‌ అభివృద్ధికీ సహకరించట్లేదన్నారు. చర్లపల్లిలో రైల్వే మూడో టెరి్మనల్‌ కోసం భూకేటాయింపు చేయలేదన్నారు. 

గిరిజనబంధు కూడా..
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత దళిత బంధు పథకానికి అతీగతీ లేదని.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్‌ తెరపైకి తెచి్చన గిరిజన బంధు పథకానికి కూడా ఉప ఎన్నిక తర్వాత అదే గతి పడుతుందని విమర్శించారు.   

కర్తవ్యపథ్‌లో బతుకమ్మ సంబురాలు
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్, హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో భాగంగా ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్దనున్న కర్తవ్యపథ్‌లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.
చదవండి: రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ సమీక్ష

>
మరిన్ని వార్తలు