ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

4 May, 2021 02:04 IST|Sakshi
హుజూరాబాద్‌లో ఈటలకు మంగళహారతులతో ఘనస్వాగతం పలుకుతున్న మహిళలు 

వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు

మెదక్‌ జిల్లాలో అసైన్డ్‌ భూములపై ఇప్పటికే కలెక్టర్‌ నివేదిక 

కొనసాగుతున్న విచారణలు

తాజాగా దేవరయాంజాల్‌ భూములపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ 

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు కూడా సర్కారు ఆదేశం 

వెంటనే రంగంలోకి దిగిన ఐఏఎస్‌లు

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకదాని వెంట మరొకటిగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. మెదక్‌ జిల్లా అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించగా, తాజాగా దేవరయాంజాల్‌ భూముల వ్యవహారంపైనా నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీ విచారణ, విజిలెన్స్‌ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. మెదక్‌ జిల్లా అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఏసీబీ, ఇంటిలిజెన్స్‌ ఇతర విభాగాలు రంగంలోకి దిగి ముమ్మర విచారణ కొనసాగిస్తున్నాయి. మరోవైపు సోమవారం కమిటీ ఏర్పాటు చేయగానే పంచాయతీరాజ్‌ అధికారులు కూడా రంగంలో దిగి పౌల్ట్రీ నిర్మాణ అనుమతులు, పన్నుల చెల్లింపు కోణాల్లో విచారణ మొదలు పెట్టారు. ఏ ప్రభుత్వ శాఖల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించారో నివేదికలు తయారు చేస్తున్నారు.   చదవండి: (చావునైనా భరిస్తా.. ఆత్మ గౌరవం కోల్పోను)

అన్ని విధాలుగా ఆలోచించే.. 
తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో చేరిన ఈటల తర్వా కీలక స్థాయికి ఎదిగారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన రెండు ప్రభుత్వాల్లోనూ ముఖ్యమైన శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. పార్టీ శాసనసభా పక్ష నేతగానూ వ్యవహరించారు. అలాంటి ఈటల రాజేందర్‌ను తప్పించడంపై సీఎం కేసీఆర్‌ అన్ని విధాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఆవిర్భావం మొదలుకుని ఎంతో మంది నేతలు పార్టీని వీడినా ఉద్యమ ఉధృతిలో వారి ప్రభావం టీఆర్‌ఎస్‌పై పెద్దగా లేకుండా పోయింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక కీలక నేతను తప్పించాల్సి రావడంతో, అన్నీ పరిశీలించే చర్యలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని అంటున్నారు.

ఈటలకు ఘన స్వాగతం 
సోమవారం రాత్రి భారీ కాన్వాయ్‌తో హుజూరాబాద్‌కు వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. అనుచరులు, అభిమానులు బాణసంచా కాల్చారు. కాబోయే సీఎం ఈటల అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినదించారు. కాగా.. ఈటల రెండు రోజులు హుజూరాబాద్‌ నియోజకవర్గం లోనే మకాం వేసి, అన్ని స్థాయిల నాయకులతో మండలాల వారీగా సమావేశమయ్యే యోచనలో ఈటల ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాతే, ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా ప్రకటించే అవకాశముందని అంటున్నారు.

ఏకాకి అయ్యారా? 
మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంపై తన కేడర్, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఒకటిరెండు రోజుల్లో ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి  రాజీనామా చేసే సూచ నలు కనిపిస్తున్నాయి. అసైన్డ్‌ భూముల వ్యవహారం తెరమీదకు వచ్చినప్పటి నుంచి మూడు రోజులుగా హుజూరాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఈటల నివాసానికి బారులు తీరారు. వివిధ కుల సంఘాల నేతలు, కొందరు ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు కూడా కలిసి సంఘీభావం ప్రకటించారు.

కానీ ఇప్పటివరకు సన్నిహితంగా మెలిగిన పార్టీ నేతలు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఈటల ప్రస్తావనే ఎత్తకపోవడం గమనార్హం. పలువురు మంత్రులు, ఇతర నేతలు వేర్వేరు అంశాలపై మాట్లాడుతున్నా.. భూకబ్జాలు, ఈటల బర్తరఫ్‌పై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇలా పార్టీ ముఖ్యులెవరూ ఈటల వైపు మొగ్గు చూపే అవకాశం లేదని కేసీఆర్‌ ముందుగానే అంచనా వేశారని నేతలు చెబుతున్నారు. అయితే ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగాలు ఈటల నివాసం వద్ద జరుగుతున్న పరిణామాల వివరాలు సేకరిస్తున్నారని, ఈటలతో సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల కదలికలపైనా నిఘా పెరిగిందని సమాచారం.

మరిన్ని వార్తలు