Telangana: ‘కేసీఆర్‌ ఒక్కో మహిళకు 10 వేలు బాకీ’

6 Sep, 2021 03:59 IST|Sakshi
ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌. చిత్రంలో జగ్గారెడ్డి, ఫాతిమా రోస్నా, సునీతారావు

 రాష్ట్రంలో మహిళా సంఘాలకు రూ.4,250 కోట్ల బకాయిలు 

ఈ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం 

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌ 

హాజరైన ఇన్‌చార్జి ఫాతిమా రోస్నా, సునీతారావు, జగ్గారెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రంలోని మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి రూ.5వేల నుంచి 10వేల వరకు సీఎం కేసీఆర్‌ బాకీ పడ్డారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మహిళా సాధికారత కోసం కాంగ్రెస్‌ పనిచేస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఆదివారం గాంధీభవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.10 లక్షలకు పెంచుతానని చెప్పిన కేసీఆర్‌ కనీసం గతంలో ఇచ్చిన రూ.5లక్షల రుణాలకు కూడా వడ్డీ చెల్లించడం లేదన్నారు.

రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఈ ప్రభుత్వం రూ.4,250 కోట్లు బాకీ పడిందన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని 3.85 లక్షల స్వయం సహాయక సంఘాలకు వడ్డీ కింద రూ.2,200 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 1.52 లక్షల సంఘాలకు చెందిన రూ.750 కోట్లు కలిపి రూ.3వేల కోట్లు చెల్లించాలని తెలిపారు. అదే విధంగా మహిళా సంఘాల్లోని సభ్యులకు అభయ హస్తం బీమా కింద చెల్లించాల్సిన రూ.1,250 కోట్లను కూడా వెనక్కు ఇవ్వడం లేదన్నారు.

గతంలో మహిళా సంఘాల సభ్యులు ఏదైనా కారణంతో చనిపోతే రూ.25వేలు వచ్చేవని, టీఆర్‌ఎస్‌ అ«ధికారంలోకి వచ్చాక రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమావేశానికి మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డి, ఆలిండియా మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు ఫాతిమా రోస్నా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ హాజరయ్యారు. 


సంగారెడ్డిలో లక్షమందితో సభ పెట్టండి: జగ్గారెడ్డి 
మహిళా సంఘాల పక్షాన మహిళా కాంగ్రెస్‌ ఆం దోళన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మహిళా కాంగ్రెస్‌ టీపీసీసీ ఇన్‌ చార్జి టి.జగ్గారెడ్డి కోరారు. మహిళా కాంగ్రెస్‌ విస్తృతస్థా యి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆ యన మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, సంగారెడ్డిలో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించాలని సూచించారు. పెట్రోల్, గ్యాస్‌ ధరల పెంపు కారణంగా పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మహిళలకే ఎక్కువగా తెలుసన్నారు.

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి, ఏఐసీసీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి ఫాతిమా రోస్నా మాట్లాడుతూ.. మహిళలపై అనేక అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని, ఇందులో తెలంగాణ కూడా మినహాయింపు కాదని పేర్కొన్నారు.  మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై అధ్యయనం చేయాలని, మహిళల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ఫాతిమా, సునీతారావులను ఘనంగా సన్మానించారు.    

మరిన్ని వార్తలు