అలంపూర్ కారులో కుస్తీలాట

9 Oct, 2022 07:00 IST|Sakshi

మంద, అబ్రహం మధ్య కొనసాగుతున్న వైరం

జడ్‌పీ ఛైర్‌పర్సన్ సరితది మరో గ్రూప్

తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు స్దాయికి చేరుకున్నాయి. నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న ఘటనలు పార్టీనేతలు, కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆది నుంచి గ్రూపు రాజకీయలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మందా జగన్నాథం, ఎమ్మెల్యే అబ్రహంకు చాలాకాలంగా వైరం కొనసాగుతోంది. పార్టీలో ఇద్దరూ చెరో గ్రూప్ నడుపుతున్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరితది మరో గ్రూపు. ఇలా ఎవరికి వారు అధిపత్యం కోసం పోరాడుతున్నారు. 

అజయ్ అత్యుత్సాహంతో పార్టీకి డ్యామేజ్?
ఎమ్మెల్యే అబ్రహం ఏకపక్ష పోకడలు..ఆయన తనయుడు అజయ్‌కుమార్ మితిమీరిన జోక్యం పార్టీలో తొలినుంచీ పనిచేస్తున్నవారికి ఇబ్బందికరంగా మారుతున్నాయనేది ప్రధాన ఆరోపణ. ఎమ్మెల్యేతో పలు అంశాలపై విభేదిస్తున్న స్దానిక నేతలు తమ ప్రజాప్రతినిధిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. కొన్నిసార్లు ఎమ్మెల్యే పాల్గొన్న సమావేశాలను సైతం అడ్డుకున్న ఘటనలు జరిగాయి. నియోజక వర్గంలోని శాంతి నగర్‌లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమంలో గొడవ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, గాయకుడు సాయిచంద్ పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత సాయిచంద్‌, ఆయన పీఏ, గన్‌మెన్‌పై స్దానిక టీఆర్ఎస్‌ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. దాడిలో సాయిచంద్‌తోపాటు గన్‌మెన్‌కు కూడా గాయలయ్యాయి. ఈ దాడికి ఎమ్మెల్యే అబ్రహం తనయుడు అజయ్‌కుమార్‌ కారణమని సాయిచంద్ ఆరోపించారు.

పెద్దల ఆశీస్సులతోనే సాయిచంద్‌ ప్రచారం?
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా అలంపూర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అబ్రహంను విభేదించే  సెకండ్ లెవెల్ క్యాడర్‌తో సాయిచంద్‌ టచ్ లో ఉండటంతో పాటు, అలంపూర్ భవిష్యత్ ఎమ్మెల్యే తానే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తనను ఆలంపూర్‌లో పనిచేసుకోమని..ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పినట్లు సాయిచంద్ ప్రచారం చేసుకోవడంపై ఎమ్మెల్యే అబ్రహం శిబిరం ఆగ్రహంగా ఉంది. సాయిచంద్ పిఏ కూడా పలువురు మండల స్థాయి నాయకులకు ఫోన్ చేసి సాయిచంద్ కు మద్దతుగా నిలవాలని కోరడం వంటి పలు ఘటనలు ఆయనపై దాడికి కారణమైనట్లు తెలుస్తోంది. 

కొడుకు కోసం ప్రయత్నం
ఎమ్మెల్యే అబ్రహం వచ్చే ఎన్నికల్లో తన కూమారుడు అజయ్ ను బరిలో దింపేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.  అందుకే అలంపూర్‌లో అబ్రహం కూమారుడు అజయ్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎంపి మందా జగన్నాదం, మాజీ జడ్పిచైర్మన్ బండారి భాస్కర్ లు ఆలంపూర్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో పక్క గద్వాల జడ్పి చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య దంపతులు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారనే టాక్ కూడా నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇది చాలదన్నట్టు  గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అలంపూర్ టికెట్ పై కన్నేసి అక్కడి టిఆర్ఎస్ శ్రేణులతో టచ్ లోకి వెళ్లడం వివాదస్పదంగా మారింది. 

గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర సందర్భంగా కూడ ఎమ్మెల్యే తనయుడు అజయ్‌ అత్యుత్సాహం వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగిందనే వాదనలు అప్పట్లో వినిపించాయి. మంచి గాయకుడిగా పేరున్న సాయిచంద్‌కు పార్టీ అధినేతతోపాటు కీలక నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయటం ద్వారా సాయిచంద్ పార్టీ పెద్దల దగ్గర పలుకుబడి సంపాదించుకున్నాడు. పెద్దల ఆశీస్సులతోనే సాయిచంద్‌ ఆలంపూర్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే గందరగోళంగా మారిన ఆలంపూర్‌ నియోజకవర్గంలో పరిస్థితిని గులాబీ పార్టీ పెద్దలు ఎలా చక్కదిద్దుతారో చూడాలి.

మరిన్ని వార్తలు