కాంగ్రెస్‌–బీజేపీలది చీకటి ఒప్పందం 

20 Oct, 2021 03:24 IST|Sakshi
జమ్మికుంటలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌  

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 

ఇల్లందకుంట(హుజూరాబాద్‌)/కమలాపూర్‌: హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ చేతులు కలిపి చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మంత్రి హరీశ్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రోల్‌ మోడల్‌గా ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ పథకాలను గౌరవిస్తున్నారని తెలిపారు.

దేశంలో రైతు బీమా, ఉచిత కరెంట్, రెసిడెన్షియల్‌ విద్యతోపాటు అనేక సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ మాత్రమేనన్నారు. రాష్ట్రంలోని వనరులను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో కార్మికులకు 12 గంటల పని విధానముందని విమర్శించారు. ఈటల రాజేందర్‌ ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటివరకు ప్రజలకు చెప్పలేదని, ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరారని మండిపడ్డారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ సైతం బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. నిజాయితీగా పనిచేసిన వారికి టీఆర్‌ఎస్‌లో తగిన గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనం గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ అని అన్నారు. కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

సిలిండర్‌కు దండం పెట్టి బీజేపీని బొందపెట్టాలి 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లే ముందు వంటింట్లోని సిలిండర్‌కు దండం పెట్టి బీజేపీని బొంద పెట్టాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్, మర్రిపల్లిగూడెంల్లో మంగళవారం జరిగిన ధూంధాం కార్యక్రమాల్లో ఆయన  మాట్లాడారు. కేసీఆర్‌కు మానవత్వం ఉందా అని ఈటల అంటున్నాడు కానీ దేశంలో కేసీఆర్‌ అంత మానవతావాది మరొకరు లేడన్నారు. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.291 రాష్ట్ర పన్ను ఉంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ చేశానని, వారం దాటినా చప్పుడు లేదని ఎద్దేవా చేశారు.  ప్రచారంలో గెల్లు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు