ఈటల స్వార్థం వల్లే ఉపఎన్నిక

8 Oct, 2021 01:09 IST|Sakshi

వ్యక్తి లాభం ముఖ్యమా.. వ్యవస్థ లాభం ముఖ్యమా ప్రజలు ఆలోచించాలి: హరీశ్‌రావు 

హుజూరాబాద్‌: ‘హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఈటల రాజేందర్‌ స్వార్థం వల్ల వచ్చింది. హుజూరాబాద్‌ జిల్లా కావాలనో, హుజూరాబాద్‌కు మెడికల్‌ కాలేజీ కావాలనో ఆయన రాజీనామా చేశారా? స్వలాభం కోసం రాజీనామా చేశారు. వ్యక్తి లాభం ముఖ్యమా.. వ్యవస్థ లాభం ముఖ్యమా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి’అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం హుజూరాబాద్‌ మండలంలోని ధర్మరాజుపల్లి, పెద్దపాపయ్యపల్లి, కాట్రపల్లి సిర్సపల్లి, వెంకట్రావ్‌పల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ.. బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ఆ పార్టీలో చేరారో ఈటల రాజేందర్‌ ప్రజలకు చెప్పాలన్నారు.

గ్యాస్‌ సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలు చేసిన బీజేపీ.. నిన్న మరో రూ.15 పెంచి ప్రజలకు వాతలు పెడుతోందని విమర్శించారు. ధరలు పెంచే బీజేపీకి ఓటు వేయాలా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల సాయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ‘ఆరుసార్లు ఈటలను గెలిపించినా ఒక్క ఇల్లు కట్టలేదు. గెల్లుని గెలిపిస్తే డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని’హామీఇచ్చారు. కాట్రపల్లి గ్రామానికి రూ.రెండు కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఎంపీ బండి సంజయ్‌ గెలిచి రెండేళ్లు దాటినా ఒక్క పని అయినా చేశాడా అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు