Huzurabad Bypoll: కంచుకోటలో చావో రేవో

1 Oct, 2021 01:09 IST|Sakshi

హుజూరాబాద్‌లో విజయ ఢంకా మోగించేదెవరో? 

ఢీ అంటే ఢీ అంటున్న అధికార పార్టీ, ఈటల రాజేందర్‌ 

పార్టీ పుట్టుక నుంచి టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే నియోజకవర్గం 

వరసగా నాలుగు సార్లు ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఈటల  

మారిన పరిస్థితుల్లో బీజేపీ నుంచి బరిలోకి మాజీ మంత్రి 

ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో ఉత్కంఠ 

సాక్షి, హైదరాబాద్‌:  ఐదు నెలల వ్యవధిలోనే రూపు మార్చుకున్న హుజూరాబాద్‌ రాజకీయం తాజాగా ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మరింత వేడెక్కనుంది. పార్టీ పుట్టుక నుంచి కంచుకోటగా ఉన్న హుజూరాబాద్‌లో ప్రస్తుత ఉప ఎన్నికలో విజయం కోసం అధికార టీఆర్‌ఎస్‌ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు ఇన్నాళ్లూ హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీలో చేరి సవాలు విసురుతున్నారు.

దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టుకునేందుకు టీఆర్‌ఎస్, ఇన్నాళ్లూ సాధిస్తూ వస్తున్న వరుస విజయాల పరంపరను కొనసాగించేందుకు ఈటల శ్రమిస్తుండటంతో ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో పార్టీని వీడిన ఈటల.. బీజేపీలో చేరి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు తన వెంటే ఉన్నారని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ కుట్రపూరితంగా బయటకు పంపిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. హుజూరాబాద్‌లో నామమాత్రంగా ఉన్న బీజేపీ.. ఈటల చేరిక నేపథ్యంలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది.   

ఆరుసార్లు టీఆర్‌ఎస్‌.. నాలుగు పర్యాయాలు ఈటలే 
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత 2004లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, 2008లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఎన్నికయ్యారు. అయితే పొరుగునే ఉన్న కమలాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి గెలిచిన ఈటల రాజేందర్‌ కూడా 2008 ఉప ఎన్నికలో విజయం సాధించారు.

2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కమలాపూర్‌ అంతర్థానమై హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అంతర్భాగమైంది. కాగా 2009లో హుజూరాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల విజయం సాధించారు. ఆ తర్వాత  2010 ఉప ఎన్నిక, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో కలుపుకుని మొత్తంగా నాలుగుసార్లు ఆ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఈటల ఎన్నికయ్యారు.   

అప్పటి ఈటల ప్రత్యర్థులందరూ ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో..! 
ఈటల కమలాపూర్‌ నుంచి రెండుసార్లు, హుజూరాబాద్‌ నుంచి నాలుగు సార్లు మొత్తంగా ఆరుసార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే ఈ ఆరు ఎన్నికల్లోనూ వివిధ పార్టీల తరఫున ఆయనతో పోటీ పడిన ప్రధాన ప్రత్యర్ధులందరూ టీఆర్‌ఎస్‌ నుంచి ఈటల నిష్క్రమణ తర్వాత గులాబీ పార్టీ గూటికి చేరుకోవడం గమనార్హం. కమలాపూర్‌లో టీడీపీ నుంచి ప్రధాన ప్రత్యర్ధిగా (2014లో) ఉన్న దివంగత మాజీ మంత్రి కుమారుడు ముద్దసాని కశ్యప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.

హుజూరాబాద్‌లో 2009 సాధారణ ఎన్నిక, 2010 ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తర్వాతి కాలంలో అధికార పార్టీలో చేరారు. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి కూడా జూలైలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదిలా ఉంటే ప్రస్తుత ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్‌ తండ్రి గెల్లు మల్లయ్య 2004 ఎన్నికలో కమలాపూర్‌ నుంచి ఈటల రాజేందర్‌పై ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం.  

ప్రలోభాలు వారివి.. పథకాలు మావి 
రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధి కోసం జాబితాకు కూడా అందనన్ని కార్యక్రమాలు చేపట్టింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళుతున్నాం.

బీజేపీ మాత్రం మోసపూరిత ప్రకటనలు, హామీలు ఇస్తూ కుట్టు మిషన్లు, బొట్టు బిళ్లలు పంచుతూ రాజకీయం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న 18 రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌ మళ్లీ గెలిచినా నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదు. ఇక హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఉనికే లేదు. ఆ పార్టీకి డిపాజిట్‌ కూడా దక్కదు.  
– తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  

మరిన్ని వార్తలు