MLA Jagga Reddy: మోదీని నిలదీసే అవకాశం కోల్పోయారు: జగ్గారెడ్డి

28 May, 2022 01:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్‌ ఉండి ఉంటే తమిళనాడు సీఎం స్టాలిన్‌ లాగా తన రాష్ట్ర అవసరాలను, ప్రజల సమస్యలను ప్రధానికి చెప్పి ఉండేవారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి మంచి అవకాశాన్ని కేసీఆర్‌ కోల్పోయారన్నారు. స్టాలిన్‌ దమ్మున్నోడని, సీఎం అంటే అలా ఉండాలని పేర్కొన్నారు.

దేశంలో కాంగ్రెస్, బీజేపీలను కాదని కేసీఆర్‌ ఏమీ చేయలేడని, దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ ఫెయిలయ్యారని అన్నారు. జగ్గారెడ్డి శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను మోదీ, మోదీని కేసీఆర్‌ తిట్టుకుంటే రాష్ట్రంలోని ప్రజల కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేకనే ఈ రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో తిట్ల జపం చేస్తున్నాయని మండిపడ్డారు.

ప్రధాని హోదాలో తెలంగాణకు వచ్చిన మోదీ రాష్ట్రానికి ఎలాంటి హామీ ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలు చేసి వెళ్లిపోవడం సరైంది కాదన్నారు. ఇదంతా చూస్తుంటే రెండు పార్టీలు అండర్‌స్టాండింగ్‌ రాజకీయాలతో ముందుకెళ్తున్నట్లు, ఆ రెండు పార్టీల మధ్య చీకటి సంబంధాలున్నట్లు అర్థమవుతోందని చెప్పారు.

ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల జమ, రెండు కోట్ల ఉద్యోగాలు లాంటి అంశాలపై ప్రధానిని అడగలేని రాష్ట్ర బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముస్లింలను వేరుచేస్తూ హిందువులను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

మీకో దండం... నన్ను అడగొద్దు : రెడ్డి, వెలమ సామాజిక వర్గాలనుద్దేశించి ï రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభిప్రాయం చెప్పాలని విలేకరులు జగ్గారెడ్డిని కోరగా.. ఆయన రెండు చేతులెత్తి దండం పెట్టారు. తాను అన్ని వర్గాలకు చెందిన నాయకుడినని, తనను ఇలాంటి విషయాల్లోకి లాగవద్దని అన్నారు.  

మరిన్ని వార్తలు